Sai Dharam Tej ‘పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం’ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా కనిపించిన సాయిధరమ్ తేజ్, ఆ తర్వాత వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ‘తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్’ చిత్రాలతో ఒక దానిని మించి మరొకటి డిజాస్టర్స్ చవిచూస్తోన్న సాయి, తదుపరి చిత్రం ‘తొలిప్రేమ’ కరుణాకరన్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి కమర్షియల్ మూవీస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో జత కట్టడానికి సిద్ధమవుతున్నాడు.

సాయికి అర్జెంటుగా ఓ కమర్షియల్ హిట్ ఎంత అవసరమో, రెగ్యులర్ సినిమాల నుండి బయటకు రావడం కూడా అంతే ముఖ్యం. ఒకే తరహా సినిమాలు చేస్తూ మూస ధోరణిలో సాయి కెరీర్ సాగుతుండడంతో, ప్రేక్షకుల ఆసక్తి నుండి సాయి దూరంగా జరుగుతున్నారు. అందులోనూ నెక్స్ట్ జాబితాలో కూడా తనకు ‘విన్నర్’ అందించిన గోపిచంద్ మలినేని కమర్షియల్ డైరెక్టర్లను లైన్ లో ఉంచుకోవడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. అయితే కొంతకొంత ఉత్తమమైన విషయం ఏమిటంటే… ఆ తర్వాత మాత్రం చంద్రశేఖర్ యేలేటి ఉండడం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎలా అయితే వరుసగా మాస్ మూస సినిమాలు చేసి విమర్శల పాలయ్యారో, సరిగ్గా అదే తరహాను సాయిధరమ్ తేజ్ ఫాలో అవ్వడం విశేషం. అయితే ‘ధృవ’ సినిమా నుండి రామ్ చరణ్ గమ్యం మరో దిక్కుకు తిరిగింది. ప్రస్తుతం ‘రంగస్థలం’తో అది పతాక స్థాయికి చేరుకున్నట్లుగా కనపడుతోంది. ఇలాంటి వైఖరే సాయిధరమ్ నుండి కూడా మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. లేదు… ఆ కమర్షియల్ బాక్స్ లోనే ఉంటాను అంటే మాత్రం… మొహమాటం లేకుండా తీర్పులు ఇవ్వడం ప్రస్తుత ప్రేక్షకుల వంతవుతోంది!