Sachin Tendulkar Happy Birthdayగత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఓ పేరు హంగామా చేస్తోంది. ట్విట్టర్ లో అయితే ‘హ్యాపీ బర్త్ డే సచిన్’ అన్న ట్యాగ్ ఆల్ ఇండియాలో టాప్ 5 లో సందడి సృష్టిస్తోంది. అవును… మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా సచిన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ… మాస్టర్ బ్లాస్టర్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ లకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

సచిన్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి వంటి చరిత్ర సృష్టించిన క్రీడాకారులను టీమిండియా అందించినప్పటికీ, ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే కాదు, ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సచిన్ సృష్టించుకున్నాడు కాబట్టే, ఈనాడు ఈ స్థాయిలో అభిమానం వెల్లివిరుస్తోంది. ఇప్పటికీ సచిన్ బ్యాట్ పడితే, మైదానాలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ నిండిపోతాయని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఆయన బ్యాటింగ్ స్టైల్ అలాంటిది… ఆయన ఫాలోయింగ్ పవర్ అలాంటిది..! సచిన్ బ్యాటింగ్ ను చూసిన కళ్ళు ఎన్నటికీ మరువలేవు. ప్రస్తుతం క్రికెట్ లో రాణిస్తున్న యువ క్రీడాకారులందరికీ సచిన్ టెండూల్కరే ఆదర్శం. అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టే సోషల్ మీడియా అంతా మరోసారి ఆయన్ని గుర్తు చేసుకుంటూ పులకించిపోతోంది. ఈ సందర్భంగా ‘మిర్చి9’ కూడా మాస్టర్ బ్లాస్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తోంది.