Sachin Tendulkar Birthday Celebrations“ఎంత చూసినా తనివి తీరనిది తిరుమలేశుని సుందర రూపం…” అని ఆ కలియుగ దైవాన్ని అశేష భక్తులు ఏ విధంగా కొలుస్తారో అందరికీ తెలిసిందే. అలాగే క్రికెట్ ప్రపంచంలో… “ఎన్నిసార్లు చూసినా తనివి తీరినవి ఈ క్రికెట్ దేవుడి షాట్లు…” అంటూ క్రికెట్ ప్రేమికులు ఆరాధిస్తుంటారు. అలాంటి సచిన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా సర్వం సచిన్ మయమైపోయింది. సెలబ్రిటీల దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు అందరూ సచిన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ సందర్భంగా సచిన్ కొట్టిన ‘సూపర్ షాట్స్’ అన్ని గుర్తు చేసుకుంటూ ‘క్రికెట్ దేవుడు’ వీడియోలు అభిమానులను ఊపేస్తున్నాయి. సచిన్ ఆటతీరును ప్రత్యక్షంగా చూడలేని ఈ తరం క్రికెట్ అభిమానులు ఈర్ష్యపడేలా ఈ వీడియోలు మారుమ్రోగుతున్నాయి. సచిన్ కొడుతున్న షాట్లకు బ్యాక్ గ్రౌండ్ లో టోనీ గ్రెగ్ కామెంటరీ చెప్తుంటే… పులకించిపోని సచిన్ అభిమాని ఉండడు అని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఆనాటి రోజులు వేరు… ఆ అనుభూతి వేరు… అంటూ వాటిని నెమరువేసుకోవడం… ముందు తరానికి చెందిన వ్యక్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఎంతమంది మహేంద్ర సింగ్ ధోనిలు పుట్టుకొచ్చినా… ఎంతమంది విరాట్ కోహ్లిలు రాజ్యమేలినా… సచిన్ ను మించిన బ్యాట్స్ మెన్ మరొకరు ఉండరని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నేటి జట్టులో ఒకరికి, నలుగురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు… కానీ, నాడు సచిన్ ఒక్కడే జట్టులో మ్యాచ్ విన్నర్. అందుకే సచిన్ సాధించిన విజయాలను ఎలా గుర్తు పెట్టుకుంటామో, సచిన్ నిరుత్సాహపరిచినపుడు అంతే గుర్తు పెట్టుకుంటాం. సచిన్ మోసినంత ఒత్తిడి భారాన్ని ప్రపంచంలో మరే ఇతర క్రికెటర్ మోయలేదని చెప్పవచ్చు… ఇక ముందు మోసే అవకాశం కూడా సచిన్ ఇవ్వలేదు…!

అందుకే సచిన్ రమేష్ టెండూల్కర్ పేరు చెప్తే అభిమానుల్లో కొత్త ఉత్తేజం ఉరకలేస్తుంది. ఇప్పుడు సచిన్ బ్యాట్ పట్టుకుని క్రీజులోకి దిగుతున్నాడని చెప్పినా… ఆ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి కనీసం ఇంకొక్క సారైనా బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగితే చూడాలన్నది ప్రతి క్రికెట్ ప్రేమికుడి ఆశ కూడా! మరి అది దక్కుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ, సచిన్ షాట్లతో కూడిన వీడియోలు యూ ట్యూబ్ లో పదిలమై ఉండడంతో… వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేయడం అభిమానుల వంతవుతోంది.

నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై జట్టుకు ఇంతమంది అభిమానులు ఉన్నారంటే… అది సచిన్ అన్న పేరు ప్రభావమే! తెలుగు జట్టు హైదరాబాద్ ఉండి కూడా ప్రిన్స్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం ముంబై ఇండియన్స్ కు మద్దతు తెలుపుతున్నారంటే… అది సచిన్ బ్యాటింగ్ ను చూసిన కళ్ళు మరో వైపుకు చూడవని చెప్పడమే! అంతటి సచిన్ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని, నిండు నూరేళ్ళు… వీలైతే ఇంకొన్నేళ్ళు… ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో తులతూగాలని కోరుకుంటూ… ‘క్రికెట్’ను మతాన్నిగా మార్చిన సచిన్ కు “జన్మదిన శుభాకాంక్షలు” తెలుపుదాం.