Sachin A Billion dreams Vs Dhoni COllectionsశుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్” సినిమాకు విమర్శకులు, సినీ ప్రేక్షకులు నీరాజనం పలికారు. అయితే 2016లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని సినిమా 100 కోట్లు కొల్లగొట్టి సూపర్ హిట్ గా నిలవడంతో, సహజంగానే సచిన్ సినిమా ఏ రేంజ్ వరకు వసూళ్లు సాధిస్తుందో అన్న ఆసక్తి అటు ట్రేడ్ వర్గాలతో పాటు, సచిన్ అభిమానుల్లో నెలకొంది. దానికి తగ్గట్లే ఫస్ట్ డే నాడు సూపర్ టాక్ తో ఓపెన్ అయిన సచిన్ సినిమా స్టామినా ఎంత? అన్న ఆసక్తి కూడా ట్రేడ్ వర్గాలలో నెలకొంది.

జేమ్స్ ఎర్స్ కిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిరోజు 8.40 కోట్లు కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి. ‘డాక్యుమెంటరీ డ్రామా’గా తెరకెక్కిన ఈ సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ అనేది అద్భుతమే గానీ, ‘ఎం.ఎస్.ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ’ స్థాయిని అందుకోలేకపోయాయి. ధోని సినిమా ఫస్ట్ డే నాడు దాదాపుగా 21 కోట్లు కొల్లగొట్టి, 2016లో అప్పటివరకు విడుదలైన సినిమాలలో సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఈ విషయంలో ధోని సినిమాను సచిన్ మూవీ అధిగమించలేకపోయింది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలో వెనుకపడిన సచిన్ సినిమా, విమర్శకుల ప్రశంసలలో మాత్రం అందనంత ఎత్తులో నిలిచింది. ధోని సినిమాతో పోలిస్తే… సచిన్ సినిమాకు విమర్శకులు పట్టాభిషేకం చేసారు. కొందరు ప్రముఖులైతే… ఈ సినిమాకు రేటింగ్స్ ఇచ్చి తక్కువ చేయలేమంటూ కీర్తించారు. అయితే ఈ రెండు సినిమాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే… ధోని సినిమాను ప్రేక్షకులు సినిమాగానే భావించారు, కానీ సచిన్ సినిమాను ఒక జీవితంలా భావించారు. అందుకే అభినందనల వర్షంలో ‘మాస్టర్ బ్లాస్టర్’ సినిమా తడిసి ముద్దవుతోంది.

ధోని సినిమాను బాగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, సచిన్ సినిమాను ఆశ్వాదించారు. అలాగే ధోని సినిమాకు లభించిన పబ్లిసిటీ, సచిన్ సినిమా విషయంలో లేకపోయింది. దీనికి ముఖ్యకారణం… ధోని క్రికెట్ గ్రౌండ్ లో ఆడుతున్న సమయంలోనే సినిమా విడుదల కావడం ప్రధాన కారణం కాగా… రిటైర్మెంట్ తర్వాత సచిన్ జీవితం తెరపైకి వచ్చింది. నిజానికి ఈ ఇద్దరినీ క్రికెట్ పరంగా సరిపోల్చడానికి వీలు లేదు గానీ, సినిమాల పరంగా బాక్సాఫీస్ రికార్డులకుండే సహజమైన క్రేజ్ రీత్యా ఈ రెండు సినిమాల రికార్డులను పోల్చుతూ కధనాలు వెలువడుతున్నాయి.