Sachin Tendulkar Special Invite for the Sachin A Billion Dreams Premiereక్రికెట్ మైదానంలో ఇప్పటికీ ఈ నామస్మరణ వింటూనే ఉంటాం… ఎక్కువ ఉద్వేగభరితమైతే అంటూనే ఉంటాం…! అది సచిన్ రమేష్ టెండూల్కర్ అంటే..! భూమిపై మానవ రూపంలో జన్మించిన ప్రతి వ్యక్తి కారణజన్ములని అంటారు. అయితే ప్రపంచానికే కారణజన్ముడిగా మారిన సచిన్ గురించి ఏం చెప్పాలి. టెన్నిస్ కావాలనుకున్న ఒక క్రీడాకారుడు, చివరికి బ్యాట్ రూపు మార్చుకుని క్రికెట్ రంగంలో “ఎవరెస్ట్”ను సృష్టించడం ఒక్క సచిన్ వల్లే అయ్యింది… ఆ సచిన్ మనదేశంలో జన్మించడం ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే విషయం.

క్రికెట్ అంటే ఏమిటో తెలియని వ్యక్తులు సచిన్ గురించి విమర్శలు చేయవచ్చు… లేక కామెంట్స్ చేయవచ్చు… కానీ క్రికెట్ గురించి కాస్త అవగాహన ఉన్న వారికి మాత్రం సచిన్ అనే వ్యక్తి నిజంగా ‘క్రికెట్ దేవుడే’ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక మ్యాచ్ లో గెలవాలంటే మా జట్టులో 11 మంది కావాలి… కానీ ఇండియాకు సచిన్ ఒక్కడు చాలు… అంటూ ప్రత్యర్ధి జట్ల కెప్టెన్లు కీర్తించిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో..! అదే ఆస్ట్రేలియన్ కెప్టెన్ స్టీవ్ వా మాటల్లో చెప్పాలంటే… సచిన్ చేతిలో ఓడిపోయినందుకు బాధపడడం లేదు అంటూ బహిరంగ ప్రకటనలు చేసిన సందర్భమూ ఉంది.

ఇవన్నీ బాహ్య ప్రపంచానికి తెలిసినవి. అయితే సచిన్ ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాడు. ఒక ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్న సచిన్, బ్యాటింగ్ అనే పుస్తకంలో పేజీలను తన రికార్డులతో ఎలా నింపేసాడు అన్న విషయాలను కులంకూషంగా వివరిస్తూ “సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్” అనే సినిమా ద్వారా ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నారు. ఇది బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను కొల్లగొడుతుంది, మొదటి రోజు ఎంత వసూలు చేస్తుంది… అన్నది ప్రామాణికం కాదు.

సచిన్ అనే వ్యక్తి ఎదిగిన తీరు ప్రపంచానికి తెలియాలి. ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన టెండూల్కర్ జీవితం ఇంకెందరికో ఆదర్శంగా నిలవాలి. అందుకే ఈ ప్రయత్నం. ఈ సినిమా చూసిన అమితాబ్… స్కూలు పిల్లలందరికీ ఈ సినిమాను ఖచ్చితంగా చూపించమని సలహా ఇచ్చారంటే… సచిన్ జీవితం ఎంత స్ఫూర్తితో నిండుకుని ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే క్రికెట్ అభిమానులు ఆ పేరు పలకగానే ఒళ్ళు పులకరించిపోతారు. అందుకే సిల్వర్ స్క్రీన్ పై ఆ సచిన్ రంగప్రవేశం కోసం అందరూ నిరీక్షిస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఆ సుముహూర్తం సమీపించనుంది. బహుశా ధియేటర్ల నుండి బయటకు వచ్చే ప్రేక్షకులు కూడా మైదానంలో మాదిరి సచిన్… సాచిన్….. సచిన్… సాచిన్… అంటూ నినాదాలతో హోరేత్తిస్తారేమో..!