sabitha-indra-reddy-to-join-trsతెలంగాణాలో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారి టిఆర్ఎస్ లోకి వెళ్లవచ్చని సమాచారం. సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని సమాచారం. చేవెళ్ల పార్లమెంట్ సీటు ఆమె కుమారుడు కార్తీక్‌ రెడ్డి ఇవ్వవచ్చని ఆయనను గెలిపించుకుని వస్తే మంత్రి పదవి గారంటీ అని సమాచారం. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్‌కు సీటు ఇవ్వడం తేలికే.

తెలంగాణ ఎన్నికలకు ముందు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఆయనను ఎలా అయినా ఓడించాలని కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నారట. ఈ క్రమంలో కాంగ్రెస్ ను అక్కడ ఖాళి చేసి ఆయనను ఒంటరిని చెయ్యాలని కేసీఆర్ వ్యూహం. దాంట్లో భాగంగానే సబితా ఇంద్రారెడ్డి పార్టీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరవచ్చని, ఆ తర్వాత మరో నలుగురు కూడా తెరాసలోకి రావచ్చని అంటున్నారు.

ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌ సబితా ఇంద్రారెడ్డి తో పాటు పార్టీ మారే వారిలో ఉన్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ముందే వీరు తెరాస కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల ముందు పెద్ద దెబ్బ తగిలింది అనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనంలో చేసుకోవాలని కేసీఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారట.