Sabitha Indra Reddy - Karthik Reddy Patlollaఎన్నికల సమీపాన తెలంగాణ కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్ అధిష్టానం మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం టికెట్ ఇవ్వగా.. ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి రాజేంద్రనగర్‌ స్థానాన్ని ఆశించారు. అయితే, పొత్తుల్లో భాగంగా ఆ స్థానం టీడీపీకి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. గణేష్ గుప్తాను ఈ సీటుకు అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ.

ఈ స్థానం కోసం పట్టుబడుతున్న కార్తీక్‌రెడ్డి ఆగ్రహంతో కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజేంద్రనగర్‌లో కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గ కార్యకర్తల సభ్యత్వాల రాజీనామాలు చేసి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి పంపుతామని తెలిపారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరితో పనిచేయించుకుంటారో చేయించుకోవాలని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి? అటు టీడీపీ మాత్రం ఈ విషయంలో చాలా గట్టిగా ఉంది. ఇప్పటికే పొత్తు కోసం తాము గట్టిగా ఉన్న ఎల్బీ నగర్, కోదాడ, జూబ్లీ హిల్స్ వంటి స్థానాలు త్యాగం చేశామని, రాజేంద్రనగర్ మాత్రం వదులుకునే ప్రసక్తి ;లేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో కార్తీక్ రెడ్డి ఎలా సముదాయిస్తారో చూడాలి. గత ఎన్నికల్లో కార్తీక్ రెడ్డి చెవెళ్ల లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. కార్తీక్ రెడ్డి కొన్నేళ్లుగా రాజేంద్రనగర్ నియోజక వర్గంపై దృష్టి సారించారు. పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా ఆ నియోజక వర్గాన్ని టీడీపీకి కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.