Sabarimala Temple Women Entry Issueదేశంలోని ప్రధాన దేవాలయాలలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను తొలగించుకుంటూ వస్తున్న మహిళా సంఘాలకు మరో శుభవార్త అందింది. చిన్ముద్రుని రూపంలో శబరిమలై కొండలపై కొలువై ఉన్న మణికంఠ అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే విషయాన్ని సోమవారం నాడు సుప్రీంకోర్టులో స్పష్టంగా తమ అభిప్రాయాన్ని తెలియజేసింది. దీంతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేసాయి. ఈ పరిణామాలతో ఇక శబరిమలకు మహిళలు పయనం అవ్వవచ్చా? అంటే కాదు అన్న సమాధానమే వెలువడుతుంది.

ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి కాలేదు. కేవలం కేరళ ప్రభుత్వం తమకు అభ్యంతరం లేదు అన్న అభిప్రాయాన్నే మాత్రమే వ్యక్తపరిచింది. కానీ మహిళల ప్రవేశానికి మరో ప్రధాన అడ్డంకి ఉంది. అదే ట్రావెన్ కోర్ బోర్డు అనుమతి. కేరళ ప్రభుత్వం అంగీకారం తెలిపినంత మాత్రాన ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో మహిళలను అంగీకరించేది లేదు అంటూ బోర్డు తెగేసి చెప్తోంది. దీంతో పూర్తి స్థాయిలో ఈ విషయంపై స్పష్టత రావాలన్నా, మహిళలకు అనుమతి లభించాలన్నా ఈ ఏడాదికైతే అవకాశం లేనట్లే.

ఎందుకంటే… శబరిమలై దర్శనం సంక్రాంతి పండగ సమయం వరకే ఉంటుంది. అలాగే మళ్ళీ దేవాలయాన్ని ఏప్రిల్ 28వ తేదీన అయ్యప్ప స్వామి పుట్టినరోజున మాత్రమే ఓపెన్ చేసి పూజలు అందిస్తారు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ మాసంలోనే ఓపెన్ అవుతుంది. కానీ, సుప్రీంకోర్టులో తదుపరి విచారణను ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదా వేయడంతో, ఈ ఏడాదికి సగం విజయమే లభించినట్లయ్యింది. మరి వచ్చే ఏడాదికైనా పూర్తి విజయం లభిస్తుందో లేక సరికొత్త ట్విస్ట్ లకు వేదిక అవుతుందో గానీ, శబరిమల దర్శనం భక్తుల్లో హాట్ టాపిక్ గా మారింది.