Saaho Director -Sujeeth comments on Reviewersయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ చిత్రం మొదటి వారం పూర్తి చేసుకుంది. తెలుగులో ప్లాప్ గా, తమిళ, మలయాళం భాషలలో డిజాస్టర్ గా ఖాయం అయిపోయింది. హిందీలో మాత్రం ప్రభాస్ ఫేమ్ వల్ల హిట్ దిశగా సాగుతుంది. సినిమా విడుదల తరువాత కనిపించని దర్శకుడు సుజీత్ ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకు వచ్చి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. విమర్శకులు అంటే తనకు గౌరవం ఉంది అంటూనే, వారి మీద విరుచుకుపడ్డాడు. వారికి సినిమా అర్ధం కాలేదని చెప్పేశాడు.

“అలా అన్నవాళ్లెవ్వరూ (లార్గో వించ్ కాపీ) కనీసం ఆ ఫ్రెంచ్‌ సినిమా కూడా చూసి ఉండరు. నిజం చెప్పాలంటే నేనూ ఆ సినిమా చూడలేదు. నా ‘రన్‌ రాజా రన్‌’ సినిమానే కాస్త మార్చి ‘సాహో’గా తీశా. నాన్న చనిపోతే, ఎక్కడో బతుకుతున్న హీరో వచ్చి.. తాను ఆ నాన్నకు కొడుకునని నిరూపించుకోవడం ‘లార్గోవించ్‌’ కథ. ‘సాహో’ కథకీ దానికీ సంబంధం ఉందా? నాన్న చనిపోయిన కథలన్నీ ‘లార్గోవించ్‌’లేనా? కొంతమంది ఈ కథకి అర్థం లేదన్నారు. అర్థం కాకపోవడానికీ, అర్థం లేకపోవడానికీ చాలా తేడా ఉంది. అర్థం కాలేదంటే మళ్లీ చూడాలి. అలాంటప్పుడు అర్థం లేదని రాయడం తప్పు. మీ అభిప్రాయాన్ని ప్రేక్షకులపై రుద్దేయడం ఇంకా తప్పు,” అని చెప్పుకొచ్చాడు సుజీత్.

సుజీత్ లార్గో వించ్ సినిమా చూడలేదన్నప్పుడు సాహూ కథ ఆ సినిమా కథ ఒకటి కాదని అంత ఖరాకండిగా ఎలా చెప్పగలడు? పైగా “బిహార్‌ నుంచి చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ‘బిహార్‌లో పుట్టి ఉంటే గుడి కట్టేసేవారు’ అని ఒకాయన చెప్పాడు. తెలుగులో ఓ కుర్రాడొచ్చి, పాన్‌ ఇండియా సినిమా తీస్తే.. మన వాళ్లు గుర్తించడం లేదు. అదే నా బాధంతా. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని నెత్తిమీద పెట్టుకున్నారు. ‘సాహో’కి వస్తున్న వసూళ్లే అందుకు సాక్ష్యం,” అంటూ చెప్పుకొచ్చాడు.

సాహూకు ఇప్పుడు కనీసం 70-80 కోట్లు పోయే పరిస్థితి. దానికి ఎవరు కారణం. ఈ మాత్రం ఆడింది అంటే అది ప్రభాస్ పాపులారిటీ వల్ల. సినిమా చూసి సుజీత్ బాగా తీశాడు అని అన్నది ఎవరు? ఒక దర్శకుడు ప్లాప్ తీయడం తప్పేమీ కాదు. మనది 10% సక్సెస్ కూడా లేని ఇండస్ట్రీ. కాకపోతే ప్రేక్షకులు ప్లాప్ అని నిర్ణయించేశాకా కూడా బీహార్ లో అలా అంటున్నారు ఢిల్లీలో ఇలా అంటున్నారు అంటూ తనను తాను మోసం చేసుకుంటే అసలకే మోసం వస్తుంది. సుజీత్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు ఎంత కష్టపడాల్సి వస్తుందో చూస్తే తను ఈ సినిమాలో ఏం చేశాడో అర్ధం అవుతుంది. సుజిత్ అన్నా… ఇంక ఎక్కువ లాగకు తెగుద్ది