Vishnu-Vardhan-Reddy BJPరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్లలోని బి ఫార్మసి స్టూడెంట్ తేజస్విని అనుమానాస్పద మృతిపై బిజెపి కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ్ళ అమరావతిలో డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి తేజస్విని హత్యాచారం కేసుపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.

అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ క్షీణిస్తున్నా సిఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్లైనా లేదు. తాడేపల్లి సిఎం క్యాంప్ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ హత్యలు, అత్యాచారాలకు సిఎం జగన్మోహన్ రెడ్డి, హోమ్ మంత్రిదే పూర్తి బాధ్యత.

ప్రతిపక్షాలని తిట్టడానికి ప్రెస్‌మీట్‌లు పెట్టి గంటలకొద్దీ మాట్లాడే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ హత్యాచారం కేసుపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ కేసుపై డిజిపిని కలిసి మేము వినతిపత్రం ఇద్దామని ప్రయత్నిస్తే ‘తమకు పై అధికారులనుంచి ఆదేశాలు వచ్చాయంటూ..’ పోలీసులు మమ్మల్ని కూడా ఎందుకు అడ్డుకొంటున్నారు? ఇటువంటి కేసులలో కూడా పోలీసులను నిష్పక్షపాతంగా పనిచేసుకోనీయకుండా వారిపై ఎందుకు ఈవిదంగా రాజకీయ ఒత్తిళ్ళు చేస్తున్నారు?

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయీ. అవసరమైతే మేము ఢిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితులు వివరిస్తాము. తేజస్విని తల్లితండ్రులకి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. కనుక వారికి పోలీసులు భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తేజస్వినికి పూర్తి న్యాయం జరిగేవరకు బిజెపి పోరాడుతూనే ఉంటుంది. తేజస్విని అనుమానస్పద మృతిపై మరింత లోతుగా దర్యాప్తుకి సిట్ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.