Baahubali Writer Vijayendra Prasad for Sequel Nayakతాజాగా తమిళంలో వచ్చిన ‘మెర్సల్’ చిత్రానికి దర్శకదిగ్గజం రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లేను అందించిన విషయం తెలిసిందే. సినీ విశ్లేషకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్ళను సాధిస్తోంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు విజయేంద్రప్రసాద్ తన తదుపరి సినిమా గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం తాను రాజమౌళికి ఓ కథను వినిపించి, ఒప్పించే పనిలో ఉన్నానని అన్నారు.

తన కొడుకు ఈ కథకు ఓకే చెబితే, ఆపై అందుకు సరిపడిన హీరో ఎంపిక మొదలవుతుందని చెప్పారు. సోషల్ కథతోనే ఓ సినిమా చేయాలని రాజమౌళి భావిస్తున్నాడని, అందుకు తగ్గ మంచి కథను తయారు చేశానని, కమర్షియల్ అంశాలతో మేళవించి ఈ కధ ఉంటుందని తెలిపారు. ‘మహాభారతం’ ప్రస్తావిస్తూ ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని కుండబద్దలు కొడుతూ చెప్పారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు నిజ జీవిత కథలు రాస్తున్నానని, అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన ‘విక్రమార్కుడు’ (హిందీలో రౌడీ రాథోడ్)కు సీక్వెల్ రాస్తున్నట్టు కూడా వెల్లడించారు. తాను విసుగు లేకుండా కథలు రాయగలనని, తనకు ఇదొక్క పనే తెలుసని అన్నారు. దర్శకుడిగా ఎందుకు విజయవంతం కాలేకపోయానన్న విషయమై మరోసారి స్పందిస్తానని అన్నారు.