S-P-Balasubrahmanyam-comments-on-Telugu-moviesప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణం జరుగుతోన్న సినిమాల తీరు పట్ల పాత తరం నాటి ప్రముఖులంతా బహిరంగంగానే విమర్శలు చేస్తున్న వైనం తెలిసిందే. ఈ పోకడ ఎక్కడికి వెళ్తుందో అంటూ ఆవేదన వ్యక్తపరిచే వారిలో సుప్రసిద్ధ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా చేరారు. ఆదివారం నాడు విజయవాడలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ‘జీవ‌న సాఫల్య పురస్కారం’ ప్రధానం చేసిన సందర్భంగా ప్రసంగించిన ఎస్పీ, సంచలన వ్యాఖ్యలు చేసారు.

తెలుగు వాళ్లు ఐక్యత, అంకిత భావం లేని వాళ్లని, తమ అభిమాన‌ హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేసే అభిమానులు, త‌మ హీరోల‌ను జాతీయ అవార్డు అందుకునే స్థాయిలో సినిమాలు చేయమ‌ని ఎందుకు అడ‌గ‌డం లేద‌ని అన్నారు. టాప్ హీరోలంతా కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలని, హీరోలు త‌మ జీవితంలో కనీసం ఒక్క సినిమా అయినా త‌మ‌ జాతి, భాష కోసం చేయాలని సూచించారు.

క‌థానాయకులు సంవ‌త్స‌రానికి నాలుగు సినిమాలు తీస్తే వాటిలో ఒక్కటైనా జాతీయ అవార్డు వచ్చేలా తీయాల‌ని, అలా చేయని నాడు అభిమానులు నిలదీస్తేనే మంచి సినిమాలు వస్తాయని బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వ్యాఖ్యానించారు. చిన్న సినిమాలకు థియేట‌ర్లు దొరకడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేసిన బాలు, ‘మిథునం’ లాంటి సినిమాకు పట్టుమని పది థియేటర్లు కూడా దొరకలేదని, పెద్ద సినిమాలు వస్తే నిర్దాక్షిణ్యంగా అటువంటి సినిమాలను సినిమా హాళ్ల‌ నుంచి తీసేస్తున్నారని ఆగ్రహించారు. అయితే చిత్రాల స్థాయిని నిర్ణయించేది మాత్రం అంతిమంగా ప్రేక్షకులేనని వ్యాఖ్య‌లు చేశారు.