RX 100 Roaring Hitప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ ను “ఆర్ఎక్స్ 100” షేక్ చేస్తోంది. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుండడం చిత్ర యూనిట్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. నిజానికి తొలి రోజు వెలువడిన టాక్ మరియు సినీ విశ్లేషణల తర్వాత, ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

తొలిరోజు ప్రదర్శించిన దూకుడునే రెండవ రోజు కొనసాగించిన “ఆర్ఎక్స్ 100” మూడవ రోజు కూడా అదే స్థాయిలో చెలరేగడం చెప్పుకోదగ్గ పరిణామం. తొలి 3 రోజుల్లోనే దాదాపుగా 3.75 కోట్లు పైనే షేర్ కొల్లగొట్టిన ఈ సినిమా, నాలుగవ రోజు ఆదివారం కావడంతో, వీకెండ్ కు ఖచ్చితంగా 5 కోట్లుకు చేరుకుంటుంది.

ఓ పక్కన మెగాస్టార్ చిన్నల్లుడు, మరో పక్కన తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరో కార్తీ బరిలో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు “ఆర్ఎక్స్ 100″కు నీరాజనం పలకడం వెనుక, పబ్లిసిటీ మహిమ ఉందని చెప్పవచ్చు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే ప్రేక్షకులలో ఆసక్తి కలిగించే విధంగా పబ్లిసిటీ చేయడం, ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిన అంశం.

ప్రస్తుతం సినిమాలపై ‘రివ్యూ’ల ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరం లేదు. కానీ అలాంటి రివ్యూలను కూడా జయించి బాక్సాఫీస్ వద్ద జయకేతనం ఎగురవేయడం సాధారణ విషయం కాదు. ఆ విధంగా ప్రేక్షకులలోకి “ఆర్ఎక్స్ 100″ను తీసుకువెళ్ళిన చిత్ర యూనిట్ కు, అమోఘమైన విజయాన్ని అందించారు.