Rushikondaవిశాఖలో సాగరతీరన్న పచ్చటి ఋషికొండని వైసీపీ ప్రభుత్వం రేయింబవళ్ళు తవ్వించేయడంతో సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసులు నడుస్తున్నాయి. కోర్టు కేసులని సాగదీయడం పెద్ద కష్టం కాదు కనుక వాటి గురించి వైసీపీ ప్రభుత్వం ఏనాడూ చింతించలేదు. కానీ మీడియా, సోషల్ మీడియాలో నిత్యం బోడిగుండుగా మారిన ఋషికొండ అంతో ఫోటోలు వస్తుండటంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ ఫోటోలు, వార్తలు రేపు కోర్టులలో ప్రస్తావనకి రాకమానవు. వస్తే ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు భావించి తగు చర్యలు చేపట్టడం ఖాయం.

ఇదీగాక ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, త్వరలో తాను విశాఖపట్నంకి షిఫ్ట్ అయిపోతున్నానని, విశాఖపట్నమే ఏపీకి రాజధానిగా ఉంటుందని చెప్పారు. మార్చి 3,4 తేదీలలో విశాఖనగరంలో జరుగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మళ్ళీ విశాఖ రాజధాని అంశం ప్రస్తావనకి వస్తుంది. కనుక ఋషికొండపై బహుశః సిఎం క్యాంప్ కార్యాలయం లేదా ప్రభుత్వ అవసరాల కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులని వేగవంతం చేసింది.

అయితే ఇప్పటికే ఋషికొండపై అందరి దృష్టి ఉన్నందున వైసీపీ ప్రభుత్వం ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. అదే… నున్నగా చెక్కేసిన కొండపై పచ్చ రంగు పరదాలు పరిపించడం! దాంతో దూరం నుంచి చూస్తే కొండంతా పచ్చగానే కనిపిస్తుంది కూడా. కానీ కొండని పరదాలు కప్పి దాచిపుచ్చలనే ప్రయత్నం చేయడంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “డ్రోన్ వీడియోల్లో ఋషికొండకు గుండుకొట్టిన అరగుండు స్పష్టంగా కనిపిస్తోంది అని అనుకుంటా గ్రీన్ షేడ్ మ్యాట్స్ తెప్పించి కప్పించేశాడు సగం మోసం రెడ్డి,” అని ట్వీట్‌పై చేశారు.

ఋషికొండపై పరదాలు కప్పి దాచిపెట్టే ప్రయత్నంపై సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో స్పందిస్తూ, “బటన్ మోహన్ రెడ్డిగారూ, మీకు పరదాలు కట్టాలి, మీరు గుండు కొట్టిన రుషికొండకీ పరదాలు కట్టాలి. ఇదేం దౌర్భాగ్యం?” అని ప్రశ్నిస్తూ ఋరుషికొండ రెండు ఫోటోలని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ, ఓ పెద్ద కొండని పరదాలు కట్టి లేని పచ్చదనం ఉన్నట్లు చూపేందుకు ప్రయత్నించడం లేదా పరదాల మాటున పెద్ద కొండని దాచేయాలనుకోవడం చాలా విడ్డూరమే కదా?