rumours YS Jagan Offers Rajya Sabha seat for chiranjeevi“పవన్ కళ్యాణ్ ఏదైనా సరే ఒక విషయం పైన స్పందిస్తే అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కళ్యాణ్ నేచర్ అది, అది కూడా సబబే అంటాను నేను. కళ్యాణ్ బాబు న్యాయం కోసమే పోరాడతాడు, న్యాయం కోసమే వాదిస్తాడు, నేను కూడా అదే న్యాయం కోసం సమయం తీసుకుంటాను, అంతిమంగా మన చిత్తశుద్ధి, హానెస్టీ, మన సంయమనం, మన ఓపిక ఇవే మనకు సక్సెస్ నిస్తాయని” ఇటీవల చిరంజీవి ఆక్సిజన్ క్యాంపులో పాల్గొన్న సమయంలో అభిమానులతో తెలిపారు మెగాస్టార్.

కట్ చేస్తే… ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన అనంతరం సినీ ఇండస్ట్రీ సమస్యల కోసం చర్చలు జరిపామని మీడియా ముఖంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఇదే అంశంపై నాగార్జున కూడా స్పందిస్తూ… ఇండస్ట్రీ కోసం చిరంజీవి వెళ్లారు కదా, త్వరలోనే అన్ని సర్దుమణుగుతాయని అన్నారు. కానీ ప్రాచుర్యంలోకి వచ్చిన మరో కధనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకం కాబోతోందన్న చర్చలు జరుగుతున్నాయి.

ఇండస్ట్రీ సమస్యల విషయం పక్కన పెడితే, చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సీటును జగన్ మోహన్ రెడ్డి ఆఫర్ చేసినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. నిప్పు లేనిదే పొగ రాదన్న చందంగా మారిన ఈ ఉదంతం, నిజానికి ఇప్పటిది కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో కూడా “వైసీపీ రాజ్యసభ సీటు – చిరంజీవి” మీడియాలో చర్చలు జరిగిన అంశమే. ఏపీలో మారుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

ఇందుకు మరింత బలాన్నిచ్చే విధంగా గతంలో వైఎస్సార్ – చిరంజీవి భేటీ నిలుస్తోంది. నాడు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావడానికి కర్మ, కర్త, క్రియ అంతా వైఎస్సార్ అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వైఎస్సార్ మరణించడం, అలాగే చిరంజీవి కాంగ్రెస్ లోకి వెళ్లి రాజ్యసభలోకి ప్రవేశించడం, కేంద్రమంత్రి పదవి అనుభవించడం… ఇవన్నీ వడివడిగా జరిగిపోయాయి. కాలక్రమేణా రాజకీయాలకు పూర్తిగా దూరమై తన అడ్డా అయిన సినీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారని అభిమానులు కూడా భావించిన తరుణంలో… జగన్ సీఎం అయిన తర్వాత ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఏపీ అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటి అంశంపై మెగాస్టార్ అనుకూలంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో, అసలు కధ వేరే ఉందని, చిరంజీవికి రాజ్యసభ సీటు దక్కబోతోందని మీడియాలో చర్చలు జరిగాయి. కాలక్రమేణా అవేమీ కార్యరూపం దాల్చలేదు గానీ, మళ్ళీ అదే రాజ్యసభ సీటు ఇపుడు తెరపైకి వచ్చింది.

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం – జనసేన పొత్తు ఉంటే, మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం కష్టమని ఇటీవల పలు సర్వేల గణాంకాలు స్పష్టం చేసాయి. దీనిని బ్రేక్ చేయడానికే ముద్రగడ ద్వారా మరో పార్టీని పెట్టించి ఉభయ గోదావరి జిల్లాలలో కాపు కమ్యూనిటీ ఓట్లను చీల్చే ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా ఇటీవల పలు మీడియాలు ప్రచురించాయి. వీటికి తోడు ఇపుడు చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా కాపు కమ్యూనిటీని తమ పార్టీ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగమే ఇదంతా అన్న ప్రచారం జరుగుతోంది.

అయితే చిరంజీవి అందుకు సమ్మతిస్తారా? ఒకవేళ మెగాస్టార్ వైసీపీలో చేరితే రాజకీయంగా అది పవన్ కళ్యాణ్ కు తీవ్ర ఇబ్బంది కలిగించే విషయంగా మారుతుంది. కాపు కమ్యూనిటీతో పాటు అశేషమైన మెగా అభిమానుల్లో సైతం చీలిక వస్తుంది. అంతిమంగా ఇది రాజకీయంగా వైసీపీకి అత్యంత అనుకూలంగా మారి 2024 లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా మారుతుంది. చిరంజీవి నాడు పార్టీ పెట్టకపోతే అప్పుడే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉండేదని ఇటీవల చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేసారు.

అంటే నాడు వైఎస్సార్ అవలంభించిన రాజకీయ విధానాన్నే మళ్ళీ అదే చిరంజీవితో కలిసి వైఎస్ జగన్ చేయబోతున్నారా? తాను, తన సోదరుడు పవన్ ఇద్దరం న్యాయం కోసం పోరాడతామన్న చిరు, అందుకు విరుద్ధంగా రాజకీయ అడుగులు వేస్తారా? ముఖ్యంగా పవన్ రాజకీయ మనుగడనే ప్రశ్నార్ధకం చేసే విధంగా జగన్ తో చేతులు కలుపుతారా? అన్నది ఇటు రాజకీయంగా, అటు మెగా అభిమానుల పరంగా అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం.

ఒకవేళ ఇవే ఫేక్ వార్తలైతే వెంటనే వీటిని ఖండించాల్సిన బాధ్యత కూడా చిరంజీవిపై ఉంది. గతంలో ప్రజారాజ్యంపై వెలువడిన అనేక ఫేక్ వార్తలకు సరైన కాలంలో స్పందించక, తర్వాత చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. ఇపుడు సరైన సమయంలో స్పందించకపోతే, తన చేతులతో పాటు పవన్ కళ్యాణ్ చేతులు కూడా కాల్చిన వారవుతారు, అలాగే రాజకీయ ఎత్తుగడలతో జనసేనను చిత్తు చేయడానికి పరోక్షంగా సహకరించిన వారవుతారు.