vangaveeti radha -YS Jagan తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు ముద్రగడ పద్మనాభం ద్వారా కాపులను రెచ్చగొట్టి రాజకీయ లాభం చేకూర్చుకోవాలని భావించిన వైసీపీ అధినేత జగన్, తాను తీసుకున్న గోతిలో తానే పడబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. జగన్ ఏదైతే స్కెచ్ వేసారో, అది ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాగా, తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన అత్యంత కీలక నేత టిడిపిలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఒక్క ప్రచారమే కాదు, దీనికి ఇప్పటికే ముహూర్తం కూడా కుదిరిందంటూ మీడియా వర్గాల తాజా కధనం.

కాపు అని చెప్పగానే గుర్తుకు వచ్చే వంగవీటి మోహన రంగా తనయుడు రాధాకృష్ణ వైసీపీని వీడి టిడిపిలోకి చేరబోతున్నారనే విషయం విజయవాడ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు పార్టీలు మారిన రాధా, మళ్ళీ అదే పనిచేస్తూ టిడిపిలోకి రాబోతున్నారని తెలుస్తోంది. తాను ఆశిస్తున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్థానం మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ నిర్ణయించుకోవడమే ఈ పార్టీ మార్పుకు ప్రధాన కారణమని సమాచారం.

కనీసం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండైనా అవకాశం ఉంటుందని భావించినా, అక్కడ యలమంచిలి రవి (మాజీ పీఆర్పీ నేత)కి వైసీపీ స్థానం ఇవ్వనుండడంతో పార్టీ మార్పు అనివార్యం అయ్యిందని టాక్. అయితే మరి టిడిపిలో సెంట్రల్ గానీ, తూర్పు గానీ అవకాశం ఉంటుందా? అంటే… తూర్పు నుండి సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు ఉన్నారు గనుక, ఇక్కడ అవకాశం లేదు గానీ, సెంట్రల్ కు ప్రాతినిద్యం వహిస్తోన్న బొండా ఉమా స్థానాన్ని రాధాకు ఇచ్చే విధంగా ఒప్పందాలు జరిగాయని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఈ పర్యవసానాల వలన వైసీపీ ఒక కీలక నేతను కోల్పోబోతోంది అన్నది మాత్రం వాస్తవం. ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనున్న నేపధ్యంలో… తిరిగి వచ్చిన తర్వాత ముహూర్తం ఖరారైందని ఓ టిడిపి నేత అనాధికారికంగా వ్యాఖ్యానించారు. వంగవీటి రాధాతో పాటు పెద్ద ఎత్తున అనుచరగణం టిడిపి జెండా పట్టుకోనుందని సమాచారం. ఇదే జరిగితే… ఇప్పటివరకు వంగవీటి రంగా హత్య పేరుతో వైసీపీ చేస్తోన్న హత్యా రాజకీయ వ్యాఖ్యలకు కాలం చెల్లినట్లే భావించవచ్చు.