Sri Reddy Proofs with Medaiఫిల్మ్ చాంబర్ ముందు తన నిరసనను ప్రత్యక్ష ప్రసారం చేసిన తెలుగు న్యూస్ చానల్ పై వస్తున్న విమర్శలపై నటి శ్రీరెడ్డి మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియోను పెడుతూ… తనకు జరిగిన అన్యాయాలకు సంబంధించిన అన్ని వీడియో సాక్ష్యాలు మహా టీవీకి అందించిన తరువాతనే సదరు ఛానల్ తన సమస్యను బయటి ప్రపంచానికి వెల్లడించేందుకు ముందుకు వచ్చిందని చెప్పింది. తనను హత్య చేస్తారని భయంగా ఉందని, తనకేదైనా జరిగితే, అందరి పేర్లూ బుల్లితెరపై ప్రత్యక్షమవుతాయని హెచ్చరించింది. తన విషయంలో ‘మహా టీవీ’కి రంకును అంటగడుతున్నారని, వారంతా తమ తమ ఇళ్లకు అంటగట్టినట్టేనని వ్యాఖ్యానించింది.

శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతోందని వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… తాను రెండున్నరేళ్ల పాటు సాక్షి టీవీ ఉప్పు తిన్నానని, ఆ ఛానల్ తనకు అన్నం పెట్టిందని, అటువంటి ఛానల్ ను, యాజమాన్యాన్ని అపఖ్యాతి పాలు చేసేంతటి దరిద్రురాలిని కాదని చెప్పింది. తాను టీడీపీతో కుమ్మక్కు కాలేదని, తనకు రాజకీయ పార్టీలతో లాలూచీ పడాల్సిన అవసరం లేదని అంది. పోరాటం చేస్తున్న తనకు మీడియా ఓ స్టేజ్ క్రియేట్ చేసిందని, అటువంటి మీడియాపై నిందలేస్తే, అందరి జాతకాలనూ బయటపెడతానని, కొన్ని వందల మంది అమ్మాయిల మానాలు పోతున్నాయని, వారికి అండగా నిలవడమే తన కర్తవ్యమని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే… సినిమాల్లో అవకాశాల కోసం కొందరు ఏమైనా చేస్తారేమో? కానీ తాను మాత్రం అలా చేయనని టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంతకుముందే కౌంటర్ వేసింది. కాస్టింగ్ కౌచ్ పై నిరసన గళం విప్పిన శ్రీరెడ్డిపై మండిపడిన రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, అమ్మాయి పిలవగానే చెప్పిన చోటుకు వస్తుందని, చెప్పినట్టు చేస్తుందని ఆమెపై వందకోట్లు పెట్టుబడి పెట్టి ఎవరూ సినిమా తీయరని రకుల్ ప్రీత్ తెలిపింది. వంద కోట్ల సినిమాలో చెప్పినట్టు చేస్తుందని ఒక యువతికి ముఖ్యమైన పాత్ర ఆఫర్‌ చేస్తారని తాను భావించడం లేదని పేర్కొంది. కాస్టింగ్ కౌచ్ పై ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని తెలిపింది.

తాను కేవలం తన గురించి మాత్రమే మాట్లాడగలనని, తనకింత వరకూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని రకుల్ స్పష్టం చేసింది. సినీ పరిశ్రమలో యువతి ఏదైనా చేస్తుందని ఆమెతో సినిమా తీయరని, ప్రతిభే అంతిమంగా నిలబెడుతుందని రకుల్ ప్రీత్ తెలిపింది. సినీ పరిశ్రమలో వచ్చే అమ్మాయిలకు తాను చెప్పేదేంటంటే.. అవకాశాల పేరుతో అడ్వాంటేజ్ తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తుంటారు… వారు కోరుకున్నది ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోవాల్సింది మహిళలేనని ఆమె స్పష్టం చేసింది. సరైన అవకాశం రావడానికి సమయం పడుతుందని, ఓపిగ్గా ఎదురు చూడాలని సూచించింది.