ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది మొదలు… “సర్ధార్ గబ్బర్ సింగ్” విజయంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటివరకు కనపడిన హుషారు పవన్ అభిమానుల్లో సన్నగిల్లుతూ వచ్చింది. దీనికి తోడు ఆడియో వేడుకపై పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి. దాదాపు రెండున్నర్ర సంవత్సరాల పాటు ఈ స్క్రిప్ట్ పై కష్టపడ్డానని చెప్పిన పవన్ కళ్యాణ్… దాదాపుగా 70 శాతం షూటింగ్ ను గత నలభై, యాభై రోజులలో చిత్రీకరించామని చెప్పడం కొసమెరుపు.
అంతకాలం స్క్రిప్ట్ పై వర్క్ చేసిన తర్వాత కూడా షూటింగ్ సజావుగా సాగలేకపోవడం అనేది కధలో క్లారిటీ లేకపోవడమే అని సినీ వర్గీయులు చెబుతున్న విషయం. అంతేకాదు, గత అక్టోబర్ లో విడుదల కావాల్సిన చిత్రాన్ని ఎలాగైనా ఈ ఏడాది సమ్మర్ ఏప్రిల్ నాటికి సిద్ధం చేయడానికి, ఏదోలా పూర్తి చేసారన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
అలాగే పవన్ చేసే సినిమా కధలు వినడం త్రివిక్రమ్ కు పరిపాటి అన్న విషయం తెలిసిందే. ఏదైనా సలహాలు, సంప్రదింపులు కావాల్సి వస్తే పవన్ మొదటగా సంప్రదించే వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్న నానుడి ట్రేడ్ వర్గాల్లో ఉంది. మరి అలాంటి త్రివిక్రమ్… ఈ సినిమా కధ తనకు తెలియదని, నేను కూడా మీలాగే సినిమా విడుదల కోసం వేచిచూస్తున్నానని చెప్పడం అనేది కూడా… ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫలితం నుండి తప్పించుకోవడానికే అన్న టాక్ ఊపందుకుంది. మొత్తమ్మీద ఆడియో వేడుక నుండి ‘సర్ధార్’ సంగతులన్నీ ‘పాజిటివ్’ నుండి ఒక్కసారిగా ‘నెగటివ్’కు మారిపోవడం గమనించదగ్గ విషయం.