rumours on NDTV prannoy royప్రముఖ జాతీయ న్యూస్ చానల్ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్‌డీటీవీ)ని స్పైస్‌ జెట్ సొంతం చేసుకోనున్నట్టు వస్తున్న వార్తలను ఎన్‌డీటీవీ యాజమాన్యం ఖండిస్తూ… ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు బొంబాయి స్టాక్ ఎక్స్‌ చేంజ్ (బీఎస్‌ఈ)కి కూడా ఓ నోట్ పంపింది. ఆ వార్తలను పట్టించుకోవాల్సిన పని లేదని, అందులో ఒక్క ముక్క కూడా నిజం కాదని ఎన్‌డీటీవీ సీనియర్ అధికారి పేర్కొన్నారు. 1988లో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ప్రారంభించిన ఎన్‌డీటీవీ త్వరలో చేతులు మారబోతోందంటూ వార్తలు వచ్చాయి.

స్పైస్‌ జెట్ అధినేత అజయ్ సింగ్ దీనిని కొనుగోలు చేయనున్నట్టు వచ్చిన వార్తలు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. ఈ వార్తలతో ఎన్‌డీటీవీ షేరు ఒక్కసారిగా 5 శాతం లాభపడింది. డీల్ తర్వాత అజయ్ సింగ్‌ కు 40 శాతం, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకు 20 శాతం ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌డీటీవీకి కష్టాలు మొదలైనట్టుగా ఈ వార్తల సారాంశం. దీనికి తోడు జూన్ 5న ప్రణయ్ రాయ్ నివాసాలపై సీబీఐ దాడులు చేసింది.

మరోవైపు ఎన్‌డీటీవీ గత దశాబ్ద కాలంగా లాభాలు చూసింది లేదు. 1,474 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు, ఈ నేపథ్యంలో విక్రయానికే మొగ్గు చూపినట్టు వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది. మరోవైపు సంస్థను కొనుగోలు చేయాలని భావిస్తున్న అజయ్ సింగ్ బీజేపీకి చాలా సన్నిహితుడు, ప్రధాని మోడీ ఆంతరంగికుల్లో ఒకరు కావడంతో మార్కెట్ వర్గాలలో తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఎన్‌డీటీవీ విక్రయ వార్తలు మార్కెట్లో పెను సంచలనం కలిగించాయి.