Rumours About Pawan Kalyan Agnathavasiటాప్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే… వాటికి సంబంధించిన అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేయడం ప్రస్తుతం షరామామూలైపోయింది. బాగా క్రేజ్ వచ్చినటువంటి ‘అర్జున్ రెడ్డి’ సినిమాలే ఒక ట్రెండ్ ను సృష్టించగా, ఇక పవన్, మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలకు ఏ రేంజ్ లో హంగామా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇటీవల విడుదలైన ప్రిన్స్ ‘స్పైడర్’ సందర్భంలోనూ… ఈ సినిమా టైటిల్ లోగో డిజైన్ తో మహేష్ అభిమానులంతా సోషల్ మీడియాలో హోరెత్తించారు. అయితే తాజాగా పవన్ ఫ్యాన్స్ వంతు వచ్చింది.

అవును… ఎన్నాళ్ళుగానో నిరీక్షిస్తున్న ఓ విషయంలో స్పష్టత రావడంతో… పవర్ స్టార్ అభిమానులంతా ప్రస్తుతం కేరాఫ్ “అజ్ఞాతవాసులు”గా మారిపోతున్నారు. ఇప్పటికే అర్ధమైయుంటుంది కదా… త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ నటించబోయే సినిమాకు “అజ్ఞాతవాసి” అన్న టైటిల్ ను ఎట్టకేలకు ఖరారు చేసారు. దీనికి సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ “అజ్ఞాతవాసి” అన్న టైటిల్ రిజిస్టర్ చేయడంతో ఫ్యాన్స్ హంగామా మొదలైంది.

ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో పవన్ అభిమానుల పేర్లన్నీ “అజ్ఞాతవాసి”గా మారిపోతూ దర్శనమిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో ఒక్కో దానిపై పూర్తి స్పష్టత వస్తుండడంతో అభిమానుల ఆనందం పీక్స్ లో ఉందని చెప్పవచ్చు. జనవరి నుండి ఈ సినిమా వాయిదా అంటూ వచ్చిన వార్తలు పుకార్లేనని తేలిన కొద్ది గంటలకే టైటిల్ విషయంలో స్పష్టత రావడంతో, జనవరి 10వ తేదీ నుండి ధియేటర్లలో పవన్ చేయబోయే హంగామా గురించి ఎదురుచూపులు చూస్తున్నారు.