మరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయడానికి రాబోతున్న “ఆర్ఆర్ఆర్” విశేషాలను చిత్ర కధా రచయిత విజయేంద్రప్రసాద్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి ఓ ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు.
జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో సినిమా చేయడమంటే ‘కమ్మ – కాపు’ కులంను అడ్డుపెట్టుకుని రాజకీయ తెరంగ్రేటం చేస్తున్నారా? అని ప్రశ్నించగా, దానికి తన కుటుంబ నేపధ్యం మొత్తాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
1966లో తన వివాహం అయ్యింది, మాది ప్రేమ పెళ్లి, ఆమెది ఏ కులమో నాకు తెలియదు, నాది మాత్రం కమ్మ కులం, ఆమెది మా కులం కాదని మాత్రం తెలుసు. కానీ చిరంజీవి “ఖైదీ” సినిమా విడుదలైనపుడు ‘మా చిరంజీవి’ అన్నాదని నాటి విషయాన్ని తెలిపారు.
అయితే తాను ‘మా చిరంజీవి’ ఏంటి? అని అడుగగా, ‘అవును… మా చిరంజీవే, మా కాపులేగా’ అని బదులిచ్చిందని అన్నారు. అది మొదలుకుని మా కుటుంబం మొత్తంలో చాలా ‘ఇంటర్ క్యాస్ట్’ వివాహాలు జరిగాయని వారందరి వివాహాలు కూడా ప్రస్తావించారు.
మా అమ్మాయిలు కాపు, పద్మశాలీలు, రెడ్డి వంటి ఇతర కులస్తులను వివాహం చేసుకున్నారని, అసలు మా కుటుంబంలో ‘కులం’ పట్టింపు అనేదే ఉండదని అన్నారు. ఇక వాటిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది అసంభవం అని స్పష్టం చేసారు.
ఇలా తన ఫ్యామిలీ విషయాలు ప్రస్తావించిన విజయేంద్ర ప్రసాద్, దాదాపుగా మూడు గంటల పైగా నిడివి గల “ఆర్ఆర్ఆర్” ఎట్టి పరిస్థితిలో ప్రేక్షకులను అలరిస్తుందని, ఏ హీరో ఎక్కువ సన్నివేశాలలో ఉన్నారనేది కధలో లీనం అయ్యాక మరిచిపోతారని ఘంటాపధంగా చెప్తున్నారు.