ఆర్ఆర్ఆర్... ఏంటంటా ఈ రచ్చ..!జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు కలిసి నటించిన “ఆర్ఆర్ఆర్” ధియేటిరికల్ ట్రైలర్ ను సిల్వర్ స్క్రీన్స్ పై రిలీజ్ చేసి అభిమానులకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చారు మన ‘జక్కన్న.’ ఇప్పటివరకు ‘ఆర్ఆర్ఆర్’కు జరిగింది ఓ లెక్క… ఇప్పటినుండి మరో లెక్క అన్న రీతిలో ఈ ట్రైలర్ కు అభిమానుల స్పందన లభిస్తోంది.

ఇది ట్రైలర్ రిలీజ్ కు జరుగుతున్న హంగామానా? లేక నిజంగానే సినిమా రిలీజ్ అయ్యిందా? అన్న స్థాయిలో నందమూరి – మెగా అభిమానుల హంగామా ఉంటోంది. ఆ మాటకొస్తే, ఇద్దరు హీరోల అభిమానులే కాదు, తెలుగు సినీ ప్రేక్షక లోకం కూడా ఈ ట్రైలర్ చూడడానికి ధియేటర్లకు కదలి వచ్చారు.

‘ఆర్ఆర్ఆర్’ విషయంలో నందమూరి – మెగా అభిమానుల గొప్పతనం ఏమిటంటే… ‘మా హీరో గొప్ప, మా హీరోనే గొప్ప’ అన్న వివాదాస్పద స్లోగన్స్ ధియేటర్ ప్రాంగణాలలో ఎక్కడా వినిపించకపోవడం హర్షించదగ్గ విషయం. ఎవరి హీరో అభిమానులు వారి హీరోలను పొగుడుకుంటూ పండగ చేసుకున్నారు.

ఇక ధియేటర్ లో సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఒక్క డైలాగ్ గానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ వినిపించడానికి ఆస్కారం లేనంతగా అభిమానులు విజిల్స్, అరుపులతో చెలరేగిపోయారు. ముఖ్యంగా జూనియర్ – చెర్రీలు ఒకే షాట్ లో కనిపించిన సన్నివేశాలకు ధియేటర్ పై కప్పులు లేచిపోయే రీతిలో అభిమానుల హంగామా ఉందంటే అతిశయోక్తి లేదు.

మునుపెన్నడూ చూడని రీతిలో సాగుతోన్న “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తంగా చాటేందుకు సిద్ధమవుతోందని మాత్రం స్పష్టమవుతోంది. భవిష్యత్తు అంతా తెలుగు సినిమా హవానే కొనసాగేలా కనపడుతోందన్న విశ్వాసం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. దీనికి జక్కన్నకు ‘హ్యాట్సాఫ్’ చెప్పాల్సిందే!