Rajamouli Gearing up to Face the Mediaరాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఇది వరకు చెప్పిన జులై 30, 2020 రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించకుండా 2020లో ప్రేక్షకుల ముందుకు పది భాషలలో వస్తుందని చెప్పడం గమనార్హం.

దీనితో సినిమా వాయిదా పడుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిని రాజమౌళి దాదాపుగా ధృవీకరించినట్టుగా కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన మత్తువదలరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఆయన, ఆ విషయంగా నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

“2020కి విడుదలవుతుందా? అసలు వస్తుందా? అని నా సినిమాపై పడొద్దు. వీళ్లే (మత్తు వదలరా టీంను ఉద్దేశిస్తూ) సంవత్సరం పాటు తీస్తే, నేను తీయకూడదా అంటూ జక్కన్న స్పందించారు. అయితే ఈ వ్యాఖ్యలతో టాలీవుడ్ లో కొత్త టెన్షన్ మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం అంటూ జరిగితే ఎప్పటికి వాయిదా పడుతుంది అనే చర్చ జరుగుతుంది.

వచ్చే దసరాకు గానీ, ఆ పై సంక్రాంతికి గానీ అనే వదంతులు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వచ్చినా పోటీగా వేరే సినిమాలు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆర్ఆర్ఆర్ వాయిదా అంటే టాలీవుడ్ కు మంచి సీజన్లు మిస్ అయిపోయినట్టే. దీనితో ఆర్ఆర్ఆర్ టీం తొందరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించేస్తే మిగతా సినిమా నిర్మాతలు తమ ప్లాన్స్ తాము చేసుకోవచ్చు.