ఆర్ఆర్ఆర్ & రాధే శ్యామ్... పవనే రక్షకుడా..?సంక్రాంతి రేసు నుండి పవన్ “భీమ్లా నాయక్” తప్పుకున్న విషయం తెలిసిందే. రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు జరిపిన చర్చలు సఫలీకృతం అయిన పిదప పవన్ సినిమా వాయిదా ప్రకటన రావడం, ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం, జక్కన్నను ట్రోల్ చేయడం… వంటి విషయాలు వడివడిగా జరిగిపోయాయి.

అయితే “భీమ్లా నాయక్” వాయిదా అనేది కేవలం ధియేటర్ల కొరత వలన వేసుకున్న వాయిదా మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో “ఆర్ఆర్ఆర్” మరియు “రాధే శ్యామ్” సినిమాలు ఆర్ధికంగా బయట పడడానికి అన్న ఓ వార్త తాజాగా ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్ ధరలకు సింగిల్ స్క్రీన్ ధియేటర్లన్నీ మూతపడుతున్న వైనం బహిరంగమే.

టికెట్ ధరలను ప్రభుత్వం పెంచితే తప్ప ఈ ధియేటర్లు తెరిసే పరిస్థితి ఇప్పట్లో లేదు. టికెట్ ధరలను పెంచాలంటే పవన్ సినిమా వెనక్కి తగ్గడం ఒక్కటే మార్గంగా మారిందా? అంటే అవుననే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతోంది. ఆ రెండు పాన్ ఇండియా సినిమాలకు నిర్మాతలు ఆశించిన టికెట్ ధర లభించాలంటే, పవన్ సినిమా తప్పుకుంటేనే సాధ్యమన్న టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ విషయం పవన్ చెవిన పడిందో లేదో తెలియదు గానీ, సంక్రాంతి సినిమాలకు మాత్రం ఏపీలో ప్రస్తుతమున్న ధరలు ఉండవని సమాచారం. తాజాగా టీవీ9 డిబేట్ లో కొడాలి నాని కూడా పరోక్షంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. మూడు, నాలుగొందల కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతలు అడిగితే ఏమైనా పరిశీలిస్తాం గానీ, 20 కోట్లు పెట్టి తీసిన సినిమాకు కూడా అదే స్థాయిలో రేట్లు పెంచమంటే ఎలా? అని అన్నారు.

పవన్ సినిమా తప్పుకోవడం వలనే కనీసం “ఆర్ఆర్ఆర్” & “రాధే శ్యామ్” సినిమాల టికెట్ ధరల పెంపు అంశంలో లబ్ది పొందవచ్చని, లేని పక్షంలో ధియేటర్ల కొరత కంటే ఎక్కువగా ఆ రెండు పాన్ ఇండియన్ సినిమాలు తీవ్రంగా దెబ్బతింటాయని అంచనాలు వేస్తున్నారు. మరి పవన్ సినిమా రిలీజ్ అయ్యే ఫిబ్రవరి 25వ తేదీ నాటికి టికెట్ ధరలు ఎలా ఉండొచ్చు? అంటే “ఆ ఒక్కడి అడక్కు” అన్న సమాధానమే చెప్పాలి.