RRR, Radhe Shyam Bheemla Nayak, Acharyaడిసెంబర్ లో ‘అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్’ వంటి సినిమాలతో కళకళలాడిన టాలీవుడ్ కొత్త సంవత్సరంలో ఇంకా వెలిగిపోతుంది భావించారు. అందుకు తగ్గట్లుగానే నాలుగు నెలల పాటు పెద్ద, చిన్న సినిమాల రిలీజ్ డేట్ లను ముందే ప్రకటించారు.

కట్ చేస్తే కొత్త సంవత్సరం వచ్చింది గానీ, ముందుగా డేట్స్ ప్రకటించిన సినిమాలైతే ఏమీ రావడం లేదు. సంక్రాంతి సినిమాలు వెనక్కి వెళ్లిపోగా, ‘బంగార్రాజు’ మాత్రం సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి గానీ, వాటిని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

ఇక ఫిబ్రవరిలో లైన్ లో ఉన్న ‘ఆచార్య, భీమ్లా నాయక్, మేజర్’ వంటి సినిమాలు కూడా వాయిదాలు అనివార్యం అవుతాయన్న టాక్ టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినపడుతోంది. సంక్రాంతి తర్వాత నుండి కరోనా ఆంక్షలు కఠినతరం అయ్యే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ఇప్పటికే చాలా రాష్ట్రాలు థియేటర్లను పూర్తిగా మూసివేయగా, మరికొన్ని రాష్ట్రాలు 50 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శితం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఇదే బాటను అనుసరించబోతున్నాయి. రోజూ నమోదవుతున్న కేసులను గమనిస్తుంటే ఈ ఉధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు.

ఈ ప్రభావం మొత్తం అన్ని సినిమాల మీద పడనున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రకటించిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కూడా మారనున్నాయి. ‘సర్కార్ వారి పాట’ సినిమా హీరో మహేష్ బాబు ఇప్పటికే కరోనా బారిన పడగా, తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పాజిటివ్ తో పేపర్ అందించారు.

దీనికి ఇటీవల మహేష్ ఇంట సంభవించిన విషాదం నుండి సూపర్ స్టార్ కోలుకుని ఎప్పటికి సెట్స్ పైకి వస్తారో అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో బాలన్స్ ఉన్న 45 రోజుల షూటింగ్ ముగించుకుని ఏప్రిల్ 1వ తేదీన విడుదల కావడం అనేది అసాధ్యం. దీనికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు.

కరోనా ప్రభావంతో ఇప్పటికే చాలా సినిమాలకు షూటింగ్స్ కూడా బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో సినీ సెలబ్రిటీస్ వరుసగా పాజిటివ్ రిపోర్ట్ లతో ముందుకు వస్తుండడంతో, ప్లాన్ చేసిన షెడ్యూల్స్ అన్ని కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అన్ని సినిమాల పరిస్థితి ఇదే.

ఓ వైపు కరోనా ఇలా విలయ తాండవం చేస్తూ అతలాకుతలం చేస్తుంటే, మరోవైపు ఏపీలో టికెట్ ధరల అంశం నానాటికి పెరుగుతూ పోతోంది. ఈ వివాదానికి ఇప్పట్లో తెరపడేలా కనపడకపోవడంతో, నాగార్జున మాదిరి పెద్ద సినిమాలు ధైర్యం చేసి రిలీజ్ చేసే పరిస్థితి లేదు.

అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ చేయాలంటే టాలీవుడ్ కు ఇపుడు రెండు తిప్పలు తప్పవు. ఓ వైపు కరోనా తగ్గుముఖం పట్టాలి, మరోవైపు ఏపీలో టికెట్ ధరల అంశం ఓ కొలిక్కి రావాలి. ఇవి గాడిలోకి రావాలంటే… ‘నాన్నకు ప్రేమతో’ డైలాగ్ మాదిరి ‘తెలుగు సినిమాను గుర్తు పెట్టుకో… మళ్ళీ మాట్లాడుకుందాం…’ అని వేచిచూడడం ఒక్కటే మిగిలివుంది.