RRR - Jr NTR - Ram Charanక్రికెట్ ప్రపంచాన్ని ఆస్ట్రేలియా లీడ్ చేసి, అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నప్పుడు ఆ దేశంలో చాలా మందికి క్రికెట్ మీద ఆసక్తి తగ్గిపోయిందట. ఎందుకంటే ప్రతిసారి గెలవడం, ఏదొక రికార్డును సొంతం చేసుకోవడంతో… గెలుపు అంటే ఓ సాధారణ విషయంలా మారిపోయి, ఆ తర్వాత గెలిచినా, ఓడినా పెద్దగా పట్టించుకునే వారు కాదట.

ఆ తర్వాత కాలంలో ఆస్ట్రేలియాకు ఇండియా చుక్కలు చూపించి, గత రికార్డులను కొంతవరకు తిరగరాసింది. ఆస్ట్రేలియా రికార్డులను టీమిండియా అయినా చేరుకుంది గానీ, నేడు బాక్సాఫీస్ వద్ద రాజమౌళి సృష్టిస్తోన్న రికార్డులను ఎవరైనా దరిచేరుకుంటారా? అన్న సందేహాలను కలిగిస్తోంది. ఎందుకంటే కనివిని ఎరుగని రీతిలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

నైజాంలో అయితే ఇటీవల ‘భీమ్లా నాయక్’ ద్వారా ఫస్ట్ డే కలెక్షన్స్ ను తన ఖాతాలో వేసుకోగా, ఇపుడు దానిని డబల్ మార్జిన్ తో ‘ఆర్ఆర్ఆర్’ కైవసం చేసుకుంది. 20 కోట్లకు పైబడి వచ్చిన షేర్ టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విశేషం ఏమిటంటే… వీకెండ్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది గనుక, మొదటి 10 రోజుల్లో ఒక్క నైజాంలోనే 100 కోట్లు షేర్ ను సాధించే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

ఒక్క నైజాం మాత్రమే కాదు, మిగిలిన అన్ని ఏరియాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మునుపెన్నడూ చూడని కలెక్షన్ల ప్రభంజనం “ఆర్ఆర్ఆర్” ద్వారా టాలీవుడ్ చవిచూస్తోంది. ఇక ఓవర్సీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలెక్షన్స్ కలిపితే దాదాపుగా 5 మిలియన్ డాలర్స్ కు చేరువగా ఉండి ఆల్ టైం రికార్డును అందుకుంది.

యుఎస్ లో ఉన్న మరో విశేషం ఏమిటంటే… ‘బాట్ మాన్’ సినిమాను దాటిపోయే విధంగా ‘ఆర్ఆర్ఆర్’ ఓపెనింగ్స్ ఉన్నాయి. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు “ఆర్ఆర్ఆర్” సృష్టించిన ప్రభంజనం ఏమిటో! ఈ రికార్డులను అందుకోవాలంటే ఏ హీరోకైనా, దర్శకుడికైనా సాధ్యమయ్యే విషయమేనా? లేక మళ్ళీ జక్కన్నే ఆ ఫీట్ ను అందుకోవాలా?

ఎందుకంటే ‘బాహుబలి 2’ కలెక్షన్స్ సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సినిమా కలెక్షన్స్ ను మరే ఇతర సినిమా అయినా దాటుతుందా? అన్న అనుమానాలను మిగిల్చింది. అందుకే ‘నాన్ బాహుబలి’ రికార్డులుగా సినీ ఇండస్ట్రీ పేర్కొంది. కానీ ఈ సారి కలెక్షన్స్ ప్రస్తుత రికార్డులకు డబల్ మార్జిన్స్ తో కొట్టడంతో, భవిష్యత్తులో ఏ సినిమాకు ఆస్కారం లేదన్న విషయమైతే స్పష్టమవుతోంది.