RP Patnaik Regrets Mahesh Babu Nijam Playback Singingప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వం వహించిన “నిజం” సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించకపోయినా, ప్రిన్స్ ఇంట పలు అవార్డులను తెచ్చిపెట్టింది. అయితే ఎప్పుడూ సూపర్ హిట్ అయ్యే తేజ – ఆర్పీ పట్నాయక్ ల కాంభినేషన్ ‘నిజం’ సినిమాకు పెద్దగా వర్కౌట్ కాలేదు. పాటలు బాగానే ఉన్నా, ప్రిన్స్ మహేష్ బాబుకు ఆర్పీ వాయిస్ సూట్ కాలేదన్నది అప్పట్లో సినీ విమర్శకులు వెలిబుచ్చిన అభిప్రాయం. సరిగ్గా ఇదే అభిప్రాయంతో పట్నాయక్ తాజాగా ఏకీభవించారు.

తన కొత్త సినిమా “మనలో ఒకడు” ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గత అనుభవాలను గుర్తు చేసుకున్న ఆర్పీ, “నిజం సినిమాలో మహేష్ బాబు వంటి సూపర్ హీరోకు పాడటం, తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పిదంగా” భావించారు. “తన వాయిస్ చాలా చిన్న పిల్లాడి స్వరంలా ఉంటుందని, మహేష్ ఒక హీరో కాదు, సూపర్ హీరో, అలాంటి హీరోకు తన కిడ్డిష్ వాయిస్ సూట్ కాలేదని, అందులో మరొక అభిప్రాయానికి తావు లేదని” చెప్పుకొచ్చారు ఆర్పీ పట్నాయక్.

నిజానికి “నిజం” సినిమా తర్వాత ఒక్క మహేష్ బాబు మినహా, ఆ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల సినీ కెరీర్ లు పాతాళంలోకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఆ అట్టడుగులోకి వెళ్ళిపోయిన వారిలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా ఒకరు. అయితే ‘చావు కబురు చల్లగా చెప్పినట్లు…’ ఈ విషయాన్ని ‘నిజం’ సినిమా విడుదలైన పుష్కరకాలం తర్వాత వెలిబుచ్చి ఏం ప్రయోజనం?! అయితే ఇలాంటి పొరపాట్లను భవిష్యత్తులో పునరావృతం చేయకుండా ఉంటే చాలు అంటున్నారు సంగీత ప్రియులు.