Royal Challengers Bangalore out from IPL 2017ప్రపంచంలోని హార్డ్ హిట్టర్లుగా పేరొందిన క్రిస్ గేల్, డివిలియర్స్, విరాట్ కోహ్లి, షేన్ వాట్సన్ వంటి బ్యాటింగ్ లైనప్ కలిగిన టీం వరుసగా ఓటములు చవిచూస్తుందంటే నమ్మగలరా? కానీ, ఇది నిజం. ఐపీఎల్ 10 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు అత్యంత దయనీయమైన ప్రదర్శనను ఇవ్వడంతో అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులలోనైనా మ్యాచ్ స్వరూపం మార్చేయగల బ్యాట్స్ మెన్లంతా ఆర్సీబీ సొంతం.

మరి అలాంటి టీం ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక్క విజయాన్ని సొంతం చేసుకుని, ఈ ఏడాది అవుట్ కాబోయ్ ఫస్ట్ టీంగా రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతోంది. మొత్తంగా 14 మ్యాచ్ లను ప్రతి టీం ఆడనుండగా, కనీసం 8 మ్యాచ్ లు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి 8 గెలిచినా, నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. అంటే 14 మ్యాచ్ లకు గానూ ఓ 6 మ్యాచ్ లలో ఓటమి పాలైనా, ఆ జట్టుకు పెద్దగా ఇబ్బంది తలెత్తకపోవచ్చు.

ప్రస్తుతం ఆర్సీబీ పరిస్థితి ఏమిటంటే… ఆడిన అయిదింటిలో నాలుగు మ్యాచ్ లను ఓడిపోవడంతో, మిగిలిన 9 మ్యాచ్ లలో ఖచ్చితంగా 7 మ్యాచ్ లలో విజయం సాధించాలి. అయితే ఇలా వరుస విజయాలు సాధించడం ఆర్సీబీకి కొత్తమీద కాదు. కానీ, యావరేజ్ స్కోర్లను కూడా చేధించలేక చతికిలపడుతుండడం సగటు బెంగుళూరు జట్టు అభిమానులకు ఆందోళన కలిగించే విషయంగా మారింది. జట్టులో విరాట్ కోహ్లి వచ్చినా కూడా ఫలితాలలో మార్పు రాకపోవడం పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది.

తాజాగా పూణే జట్టుతో జరిగిన మ్యాచ్ లో 162 పరుగులను చేధించలేకపోవడంతో విమర్శలు మరింతగా ఎక్కువయ్యాయి. జట్టులో విరాట్ కోహ్లి, డివిలియర్స్, వాట్సన్, కేదార్ జాదవ్ వంటి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ, ప్రయోజనం మాత్రం శూన్యం. మొత్తంగా 20 ఓవర్లలో కేవలం 134 పరుగులను మాత్రమే నమోదు చేసి, నెట్ రన్ రేట్ పరంగానూ వెనుకబడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై, ఒక్కో మెట్టు ఎదగాలంటే చాలా కష్టసాధ్యమైన విషయమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.