Royal Challengers Bangaloreవిజయానికి 120 బంతుల్లో 132 పరుగులు చేయాల్సి ఉంది… క్రీజులోకి కోహ్లి, గేల్, డివిలియర్స్, జాదవ్ వంటి అరవీర బ్యాట్స్ మెన్లు రావాల్సి ఉంది… క్రికెట్ గురించి కాసింత పరిజ్ఞానం తెలిసినా… విజయం బ్యాట్స్ మెన్ల వైపుదే అని చెప్తారు. అయితే ఎక్కడైనా ఇది జరుగుతుందేమో గానీ, ఐపీఎల్ లో మాత్రం కాదంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు నిరూపించింది. ‘స్వల్ప’ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు అత్యంత ‘స్వల్ప’ స్కోర్ కు ఆలౌట్ అయ్యి, అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

ఈ ఏడాది అత్యంత దయనీయంగా మారిన బెంగుళూరు ప్రదర్శన కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో మరింతగా దిగజారిందని చెప్పవచ్చు. కేవలం 132 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి అడుగు పెట్టిన బెంగుళూరు బ్యాట్స్ మెన్లల్లో ఒక్కరూ కూడా రెండెంకల స్కోర్ ను చేరుకోలేకపోయారంటే అర్ధం చేసుకోవచ్చు… ఏ స్థాయిలో తమ ప్రదర్శన ఇచ్చారో..! కేదార్ జాదవ్ చేసిన 9 పరుగులే బెంగుళూరు బ్యాట్స్ మెన్లలో అత్యధిక స్కోర్. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత స్వల్ప స్కోర్ 49 పరుగులను బెంగుళూరు జట్టు నమోదు చేసింది.

ఈ పరాజయంతో ఆడిన 7 మ్యాచ్ లలో కేవలం 2 విజయాలతో 4 పాయింట్లతో అట్టడుగు స్థానంలో బెంగుళూరు జట్టు నిలిచింది. చేతిలో ఇంకా 7 మ్యాచ్ లు ఉన్నాయి గానీ, గత సీజన్లలో మాదిరి బెంగుళూరు జట్టు మళ్ళీ పుంజుకుంటుందని మాత్రం అభిమానులు భావించడం లేదు. నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉండడంతో, ఐపీఎల్ సీజన్ 10 నుండి ఖచ్చితంగా అవుట్ అయ్యే జట్టుగా బెంగుళూరు నిలవడం ఖాయంగా చెప్తున్నారు. ఇండియన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కోహ్లి సేన ప్లే ఆఫ్స్ లో ఎంటర్ కాకుండా వెనుదిరగడం నిరాశకు గురి చేసే అంశమే.