Roland Garros Harassment Viralచేసే వృత్తి ఏదైనా… మహిళలపై వేధింపులు మాత్రం ఖాయం… అన్న రీతిలో సాగుతున్న ప్రపంచంలో మరో సంఘటన వెలుగు చూసింది. యాంకర్లుగా తమ వృత్తిని నిర్వహించే మహిళలపై ఒకప్పుడు క్రికెటర్ క్రిస్ గేల్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. డబుల్ మీనింగ్స్ డైలాగ్ లతో గేల్ చేసిన సదరు వ్యాఖ్యలకు తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ, ఇప్పటికీ అప్పుడప్పుడు ఇదే రకమైన వ్యాఖ్యలతో సదరు యాంకర్లను ఇబ్బంది పెడుతూ ఉంటాడు గేల్. అయితే తాజాగా మరో క్రీడాకారుడు ఒకడుగు ముందుకు వేసి ఏకంగా ఓ మహిళా యాంకర్ ను ముద్దులతో ముంచెత్తడానికి ప్రయత్నించాడు.

ప్రస్తుతం జరుగుతోన్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో… ఓ యాంకర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కాడు. ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని కూడా చూడకుండా తనను ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన యాంకర్ మెడ చుట్టూ చేతులు వేసి బలంగా పట్టుకుని పలుమార్లు ముద్దాడేందుకు ప్రయత్నించాడు. తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టిన మాక్సమీ హమోవ్ అనే ఫ్రెంచ్ ఆటగాడి ఘనకార్యం ఇది. ‘యూరో స్పోర్ట్’ జర్నలిస్ట్ మాలీ థామస్ అతని చేతిలో చిక్కి బయటపడలేక, ప్రత్యక్ష ప్రసారానికి అవాంతరం కలగడం ఇష్టం లేక ఎంతో ఇబ్బంది పడిన వైనం వీడియోలో వీక్షించవచ్చు.

ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు హమోవ్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. జరిగిన ఘటనపై యాంకర్ మాలీ స్పందిస్తూ… “నేను అనుకోని ఘటన ఇది. లైవ్ కాకుంటే అతడిని చావగొట్టేదాన్ని” అంటూ తన మనోభావాలను స్పష్టంగా తెలిపింది. ప్రస్తుతం వరల్డ్ నంబర్ 287 ఆటగాడిగా ఉన్న హమోవ్ అక్రిడేషన్ ను రద్దు చేశామని, జరిగిన ఘటనకు మాలీకి క్షమాపణలు చెబుతున్నామని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. ఫ్రెంచ్ ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ ఆడేందుకు వచ్చిన ఈ ఆటగాడు సభ్య సమాజం తలవంచుకునేలా దారుణంగా ప్రవర్తించడం దురదృష్టకరం.