YSR-Congress-Roja---Nagari2014లో రోజా వైఎస్సాఆర్ కాంగ్రెస్ తరపున స్వల్ప మెజారిటీతో గెలిచింది. ఎమ్మెల్యే ఐన ఆనందంలో ఆమె చెలరేగిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నా తమ పార్టీ వాణి గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఒక సమయంలో హద్దు దాటి తన క్రమశిక్షణా రాహిత్యంతో శాసనసభలో ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. రోజా నోటి దురుసు వల్ల టీడీపీ నాయకులు గానీ, అభిమానులను గానీ ఆమెను బద్ద శత్రువులానే చూస్తారు. దీనితో ఈ సారి ఎలాగైనా ఆమెను ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

టీడీపీకి అండగా ఉన్న గాలి ముద్దుకృష్ణమ నాయుడు చనిపోవడంతో నియోజకవర్గంపై పార్టీ పట్టు పోయింది అని వైకాపా వారు భావించారు. గాలి కుమారుడు భానుకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే ఆయనకు సొంత ఫ్యామిలీలోనే మద్దతు లేకపోవడంతో రోజా సునాయాసంగా గెలవడం ఖాయమన్నారు. అయితే నియోజకవర్గంలో రోజా కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రచారంలో భాను చురుకుగా ఉండటంతో శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ తరపున రోజాను ఓడించిన చెంగారెడ్డి టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

నియోజకవర్గంలో ఆయనకు నికరంగా 2000-3000 ఓట్లు ఉండటంతో టీడీపీ కలిసొచ్చేలా ఉంది. నగరి నియోజకవర్గంలో 50% తమిళ ప్రజలు ఉన్నారు. వారిలో రోజా భర్త సెల్వమణికి చెందిన ముదలియార్ సామాజికవర్గం వారే ఎక్కువ. వీరి మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు రోజా. తమిళనాడు ప్రతిపక్షనేత స్టాలిన్ ను తీసుకొచ్చి ప్రచారం చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనితో ఆ వర్గంలోనూ చీలిక వస్తుందని ఆయన అంచనా. అదే కాకుండా రోజాను ఓడించాలని వైకాపాలోనే కొందరు ప్రయత్నం చేస్తున్నారు. దీనితో ఆమె ఎదురీదుతున్నారు అనే చెప్పుకోవాలి.