What is in Roja's letter?తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని నగరి ఎమ్మెల్యే రోజా స్పీకర్ కోడెల శివప్రసాద్ కు రాసిన లేఖలో వివరించారు. అలాగే తాను చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకుంటున్నానని సదరు లేఖలో రోజా పేర్కొన్నారు. అంతకుముందు వరకు తన తప్పిదం ఏమీ లేదు, టిడిపి అభ్యర్ధులే రెచ్చగొట్టారు అంటూ వాదనలు చేసిన రోజా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ ను లేఖ రాసి, సదరు కాపీని సుప్రీంకోర్టుకు కూడా అందజేశారు. దీంతో వితండ వాదనలు, మొండితనం నుండి రోజా వెనక్కి తగ్గినట్లు స్పష్టమైంది.

ఇదే సమయంలో రోజాకు సుప్రీంకోర్టు నుంచి స్వల్ప ఊరట లభించింది. అసెంబ్లీలోని వైకాపా కార్యాలయానికి రోజాను అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ క్లయింట్ రోజా, స్పీకర్ ను ఉద్దేశించి క్షమాపణ లేఖ రాశారని చెబుతూ, న్యాయవాది ఇందిరా జైసింగ్ లేఖ ప్రతిని న్యాయమూర్తికి అందించారు. ఇదే లేఖను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పీకరుకు సూచించిన న్యాయస్థానం, ఈ సమస్యను మరింతగా లాగవద్దని కోరింది. కేసు తదుపరి విచారణను ఆగష్టు మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. మొత్తానికి రోజా వెనక్కి తగ్గడం వలన అసెంబ్లీ దిశగా ఆమె పయనించడానికి ఒక అడుగు ముందుకు పడింది.