మొన్న భోగీ పండుగనాడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులు నారావారిపల్లెలో భోగీ మంటలు వేసుకొని సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. వారితో సహా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్: 1 ప్రతులను భోగీ మంటల్లో వేసి విన్నూత్నంగా నిరసనలు తెలిపారు.
ఈ సందర్భంగా బాలయ్య అభిమానులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తుంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జన్సీ విధించిన్నట్లుంది. ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నంబర్: 1ని జారీ చేయడమే ఇందుకు నిదర్శనం,” అని అన్నారు. బాలృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూ అనేక పంచ్ డైలాగ్స్ వేశారు.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో శెట్టిపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మంత్రి రోజా స్పందిస్తూ, “బాలకృష్ణకి ఎవరో వ్రాసిచ్చిన్న స్క్రిప్ట్స్ వల్లెవేయడం మాత్రమే వచ్చు. అన్‌స్టాపబుల్ షోకి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే, వీరసింహారెడ్డి సినిమాకి స్క్రిప్ట్ మరొకరు రాసిచ్చారు. జీవో నంబర్: 1లో అసలు ఏముందో బాలకృష్ణ చదివారా?చదివి ఉంటే ఆయన ఆవిదంగా మాట్లాడేవారు కారు. ఏదో బావ కళ్ళలో ఆనందం చూడటం కోసం ఆయన నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేశారు. జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఇంత ఆనందంగా పండగ చేసుకొంటుంటే, రాష్ట్రంలో ఎమర్జన్సీ పాలన సాగుతోందని బాలకృష్ణ అనడం చాలా బాధాకరం. ఆయన సినిమాలో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఆనందించడానికి పనికివస్తాయేమో కానీ వాటితో రాష్ట్రం బాగుపడదు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతోంది,” అని అన్నారు.
సినిమాలు, ఓటీటీలో వచ్చే టాక్ షోలు ప్రజలని వినోదింపజేయడానికే అనే సంగతి అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులని రంజింపజేసిన మంత్రి రోజాకి బాగా తెలిసే ఉంటుంది. అయితే సినిమాలలో కాల్పనికతో పాటు వర్తమాన రాజకీయ, సామాజిక పరిస్థితులని కూడా ప్రతిభింభిస్తుంటాయి. పైగా సినిమాలకి, రాజకీయాలకి చాలా దగ్గర సంబందమే ఉంది. అందుకే బాలయ్య సినిమాలో అటువంటి పంచ్ డైలాగ్స్ పడ్డాయి. వాటిని విని మంత్రి రోజా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం దేనికి? టిడిపి, జనసేనలని రాజకీయంగా దెబ్బ తీయడానికి వైసీపీ నేతలు కూడా రాంగోపాల్ వర్మతో సినిమాలు తీయిస్తున్నారు కదా?వర్మ చేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు చేయిస్తున్నారు కదా? కనుక ప్రతిపక్షాలు తమ ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండాలని ఎలా కోరుకోగలరు?
“జీవో నంబర్: 1ని ప్రతిపక్షనేతలు చదివారా లేదా?” అని వైసీపీలో రోజా వంటివారు నిలదీస్తుంటారు. “అయితే ముందు మంత్రులైనా చదివారా?” అనే ప్రతిపక్షనేతలు ప్రశ్నకి ఇంతవరకు ఎవరూ సమాధానం చెప్పనేలేదు.
ఒకవేళ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్: 1 నిజంగా ప్రజాహితం కోసమే జారీ చేసినదని, అది రాజ్యాంగబద్దంగా ఉందని హైకోర్టు భావించి ఉంటే దానిని అమలుచేయకుండా స్టే ఎందుకు విధించింది?అనే ప్రశ్నకు రోజా వంటి వైసీపీ నేతలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.