roja quits jabardasth comedy showచిత్తూరు జిల్లా, నగరి నియోజక వర్గపు ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి వరించిన విషయం తెలిసిందే. మూడేళ్ళ నిరీక్షణ ఫలితం ఇప్పుడు సాకారం కావడంతో రోజా ఎంతో ఆనందంగా ఉంది. ఏ శాఖ ఇచ్చినా, తాను తన బాధ్యత నిర్వహిస్తానని, జగనన్న క్యాబినేట్ లో చోటు దక్కడమే తనకు చాలని రోజా అభిప్రాయపడ్డారు.

తనను ‘ఐరన్ లెగ్’గా ముద్ర వేసిన వాళ్ళకి సమాధానంగా ఈ మంత్రి పదవి అంటూ తెలుగుదేశం పార్టీకి కౌంటర్ గా రోజా చెప్పుకొచ్చారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన జగనన్న ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిగా ఉంటానని తెలిపిన రోజా, మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక నుండి ‘జబర్దస్త్’ షోకు, అలాగే సినిమాలకు గుడ్ బై చెప్తూ ఓ ప్రకటన చేసారు.

గత మూడేళ్ళుగా ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే స్థానంలో ఉంటూనే రోజా ‘జబర్దస్త్’ మరియు ఇతర టీవీ షోలకు షూటింగ్ లు చేసారు. అయితే మంత్రి పదవి ప్రకటన వచ్చిన వెంటనే షూటింగ్ లకు తిలోదకాలు ఇచ్చేయడం అంటే, ఎమ్మెల్యేగా ఉన్నపుడు తనకేమి బాధ్యతలు లేవు, కేవలం మంత్రి పదవి ఇస్తేనే ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పడం కాదా?

ఇన్నాళ్లు ఎలా ఉన్నా, ఇక నుండైనా మంత్రి పదవిలో ఉంటూ ప్రజాసేవలో భాగస్వామి అవుతానని చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమే అయినా, మంత్రి పదవి వరిస్తేనే ప్రజాసేవలో పాలుపంచుకోవడం ఎంతవరకు సమంజసమో? అంటే ఇక నుండి ‘జబర్దస్త్’లో రోజా నవ్వులు మటుమాయం కానున్నాయి.

ఇంతకీ మంత్రి పదవి చేపట్టిన తర్వాత చేయబోయే “ప్రజాసేవ” ఏమిటి అన్నది మాత్రం అడగకండోయ్! అది తెలియాలంటే… ఇంతకుముందు ఆయా మంత్రి పదవుల విధులు నిర్వహించిన అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, సుచరిత అండ్ కోలకే తెలియాలి. వీరంతా చేసిందే రాబోయే రెండేళ్లలో ”రోజా అండ్ కో” కూడా చేస్తారా? అనేది కాలమే సమాధానం చెప్తుంది.