roja-happy-for-chandrababu-naidu-behaviourఅసెంబ్లీలోకి తనను రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు సర్కార్ పై వైసీపీ నేత రోజా మరియు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం నాడు అసెంబ్లీ గేట్ వద్ద ఏర్పడిన నాటకీయ పరిణామాల నేపధ్యంలో నిమ్స్ కు చేరిన రోజా… ప్రివిలేజ్ కమిటీకి కూడా హాజరు కాలేకపోతున్నానని తేల్చిచెప్పారు. మరోవైపు ప్రివిలేజ్ కమిటీకి హాజరైన ఇతర వైసీపీ నేతలు… అసెంబ్లీలో తాము చేసిన కామెంట్లను ఒప్పుకుని, భవిష్యత్తులో పునరావృతం చేయమని మీడియా వేదికగా వెల్లడించారు.

ఇదంతా నాణానికి ఒక వైపు. మరోవైపు పరిశీలిస్తే… రోజాను అసెంబ్లీలోకి రానివ్వకుండా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీ ఫుల్ ఖుషీగా ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు నిర్ణయంతో శాసనసభకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ పట్ల రోజా చేస్తున్న పోరాటాలు మీడియా వర్గాల్లో ప్రధానంగా ప్రసారం కాబడుతున్నాయి. దీంతో నగరి ఎమ్మెల్యే రోజాకు మునుపెన్నడూ లేనంత పబ్లిసిటీ సొంతమవుతోంది.

సాధారణంగా ఈ స్థాయి పబ్లిసిటీ రావాలంటే రాజకీయ నాయకులు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుత ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో పైసా ఖర్చు లేకుండా రోజా హైలైట్ అవుతోంది. సంచలనమైన వార్తల కోసం ఎదురు చూసే మీడియా వర్గేయులకు రోజా చేస్తున్న నాటకీయ పరిణామాలు కావలసినంత ఆహారాన్ని ఇస్తున్నట్లయ్యింది. దీంతో గత రెండు రోజులుగా మీడియా మాధ్యమాలలో రోజానే హైలైట్.