Roja about chandrababu naiduప్రతిపక్ష పార్టీ వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9 కాగా, మరో వారంలో జ్యోతుల నెహ్రూ చేరికతో ఈ సంఖ్య రెండెంకేలకు చేరుకుంటోంది. అంతేకాదు, ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది… వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది… ఇక, ఆ పార్టీలో రోజా, జగన్ లే మిగులుతారు అంటూ వివిధ సందర్భాలలో తెలుగుదేశం నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరికొంతమంది అయితే… వైసీపీ నుండి ఎవరూ వచ్చినా ఆహ్వానిస్తాం గానీ, రోజాను మాత్రం చేర్చుకునేది లేదని తెగేసి చెప్పారు.

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అధ్యక్షతన రాజకీయాల్లోకి వచ్చిన రోజా, ఇపుడు అదే చంద్రబాబు బద్ధ శత్రువుగా పరిగణించడం వెనుక జగన్ పార్టీ సిద్దాంతాలు కారణమై ఉండవచ్చు గానీ, వ్యక్తిగతంగా రోజా అవలంభిస్తున్న వ్యవహార తీరే ఆమెను అడ్డుకుంటోంది అన్నది రాజకీయ వర్గాల వాదన. అయితే అసలు రోజా మదిలో ఏముంది? తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటర్వ్యూలో ‘చంద్రబాబు’ నాయుడుకు ‘రోజా’ అంటే ఎందుకు అంత భయం? వైసీపీ నుండి ఎవరూ వచ్చినా తీసుకుంటాం… రోజా తప్ప… అని అంటున్నారు…. అని యాంకర్ వేసిన ప్రశ్నకు రోజా చెప్పిన జవాబు రాజకీయ వర్గాలను అవాక్కు చేసింది.

‘చంద్రబాబు అలా చెబుతున్నా… కానీ, తెలుగుదేశం పార్టీలోకి రమ్మంటూ చుట్టూ పక్కల నుండి ఎన్ని బలవంతాలు వస్తున్నాయో నాకు తెలుసు…’ అంటూ రోజా ఇచ్చిన సమాధానం కేవలం వైసీపీ ‘మైండ్ గేమ్’లో భాగంగా ఇచ్చిందా? లేక నిజంగానే తమ పార్టీలోకి రావాలంటూ టిడిపి వర్గాల నుండి రోజాపై అంత ఒత్తిడి ఉందా? అన్న ప్రశ్నలను లేవదీసింది. నిజానికి రాజకీయ తెరపై రోజా అంటే ఒక ‘ఐరన్ లెగ్’గా ముద్రపడిన విషయం తెలిసిందే. ఆనాడూ అలిపిరిలో చంద్రబాబు ఘటన నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళాలని భావించిన నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి జరిగిన ఉదంతం మరియు వైసీపీలో చేరగానే జగన్ జైలు పాలు కావడం, అలాగే ఖచ్చితంగా గెలుస్తారని భావించిన జగన్ ప్రతిపక్షానికే పరిమితం కావడం వంటి అంశాలతో రోజాపై ఏ ఇతర పార్టీ వర్గాలు ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరిగింది.

రోజా ఒక ‘ఐరన్ లెగ్’ అన్న అభిప్రాయం ఏర్పడే విధంగా జరిగిన ఈ పరిణామాలతో ఒక్క రాజకీయ వర్గాల్లోనే కాక, సామాన్య జన జీవనంలోనూ ఇదే రకమైన భావన బలంగా నాటుకుపోయింది. మరి అలాంటి రోజాను తిరిగి తెలుగుదేశం పార్టీ వర్గాలు తమ పార్టీలోకి చేర్చుకోవడానికి నిజంగా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా కాదనే సమాధానమే పొలిటికల్ వర్గాల నుండి వస్తోంది. అయితే కేవలం నోటి మాటలకే కాకుండా, ఏదైనా ఆధారాలు చూపించినట్లయితే రోజా వ్యాఖ్యలకు మరింత బలం చేకూరేది… అలాగే అధికార పార్టీ వర్గీయులను ఎండగట్టడానికి ఒక అవకాశం లభించి ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అలా కాకుండా కేవలం టిడిపిపై బురద జల్లడానికే నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, వాస్తవానికి ఇలాంటి సత్యదూరపు వ్యాఖ్యలతోనే రోజా తన ప్రభావాన్ని కోల్పోతున్నారని.., రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సహజమే అయినప్పటికీ, సగటు ప్రజానీకంలో రోజాపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడడంతో, ఆధారాలు ఉంటే తప్ప, నమ్మే స్థితిలో ప్రజలు లేరన్న విషయాన్ని గుర్తిస్తేనే రోజా ప్రవర్తన శైలిలో మార్పు వస్తుందన్న కామెంట్లు రాజకీయ నిపుణుల నుండి వస్తున్నాయి.

‘నేనేమి మట్టి ముద్దను కాదని, చంద్రబాబు తననేమీ శిల్పంగా మార్చలేదని, నేను తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడ్డానే తప్ప, చంద్రబాబు వలన నాకు కలిగిన ప్రయోజనమేమీ లేదని, అసెంబ్లీలో ‘కామ సిఎం’ అన్న మాట నిజమేనని, అయితే అది ‘కాల్ మనీ’ సిఎంను షార్ట్ కట్ లో అలా పిలిచానని, దానికి సంబంధించి ‘క్షమాపణలు’ చెప్పాల్సి వస్తే చెప్పడానికి తానూ సిద్ధంగా ఉన్నానని’ చెప్పుకొచ్చిన రోజా భవిష్యత్తులో పార్టీ మారే అవకాశం లేదని, టిడిపియే కాదు, స్వయంగా పవన్ కళ్యాణ్ పిలిచినా ‘జనసేన’లోకి వెళ్లనని స్పష్టం చేసారు. అయితే రోజాను పిలిచే ధైర్యం అటు చంద్రబాబుకు గానీ, ఇటు పవన్ కళ్యాణ్ కు గానీ ఉందంటారా..? బహుశా ఈ విషయంలో పార్టీ అధినేతలను నిజంగానే రోజా భయపెడుతున్నారన్న ఛలోక్తులు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి.