Rohit Sharma Super Show in first one day matchఇటీవల కాలంలో వన్డేలలో అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ శర్మ, ఈ రోజు జరిగిన మొదటి వన్డేలోనూ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ తో ప్రారంభమైన 5 వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు తొలి వన్డేను సొంతం చేసుకుని సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 309 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 163 బంతుల్లో 171 పరుగులతో దుమ్ము దులిపాడు. అద్భుతమైన షాట్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రోహిత్ కు విరాట్ కోహ్లి (91 పరుగులతో) చక్కటి సహకారం అందించారు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 207 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనించింది. అయితే చివరి 10 ఓవర్లలో ఆశించిన రీతిలో పరుగులు చేయడంలో విఫలమవ్వడంతో కేవలం 309 పరుగులే చేయగలిగింది.

భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుపోయింది ఆసీస్. అయితే స్మిత్ 135 బంతుల్లో 149 పరుగులు, బెయిలీ 120 బంతుల్లో 112 పరుగులు చేసి, మూడవ వికెట్ కు 242 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ లక్ష్యాన్ని చాలా తేలికగా అందుకోగలిగింది. ఈ మ్యాచ్ లో తెరంగ్రేటం చేసిన భారత బౌలర్ శ్రాన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. భారీ సెంచరీతో ఆసీస్ ను విజయ తీరాలకు చేర్చిన స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.