sachin Tendulkar Vs Rohit Sharma Records క్రికెటర్ గా, బ్యాట్స్ మెన్ గా సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులకు కొదవలేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెంచరీల సెంచరీని పూర్తి చేసిన ‘ఒకే ఒక్కడు’గా నిలిచిన సచిన్ రమేశ్ టెండూల్కర్, తన కెరీర్ లో తొలి సెంచరీని సాధించడానికి ఎంతటి సమయం తీసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తను ఆడిన 70వ వన్డేలో తొలి సెంచరీ సాధించిన సచిన్, కెరీర్ ముగిసే సమయానికి ఏకంగా 49 శతకాలను కొట్టి… ఆల్ టైం జాబితాలో ‘ఎవర్ గ్రీన్ బ్యాట్స్ మెన్’గా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు.

అయితే ఈ రికార్డులను అందుకోవాలనే తాపత్రయం, లక్ష్యం ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి పేరు ప్రధానంగా వినపడుతోంది. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లికి పోటీ మరో వైపు హషీం ఆమ్లా కూడా ఉన్నాడు. వీరిద్దరూ కెరీర్ తొలినాళ్ళ నుండి సెంచరీల మోత మోగిస్తూ ఒక్కో రికార్డును బద్దలు కొట్టుకు వెళ్తున్నారు. కానీ మరో క్రికెటర్ మాత్రం… సచిన్ కెరీర్ ను అనుసరిస్తూ వెళ్తున్నట్లుగా కనపడుతోంది. అతను మరెవరో కాదు… మోస్ట్ స్టైలిష్ బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ.

అవును… ఇప్పటివరకు 157 వన్డేలు ఆడిన రోహిత్, 11 శతకాలు, 31 అర్ధ శతకాలతో 5435 పరుగులు చేసాడు. అయితే రోహిత్ వన్డే సెంచరీలను పరిశీలిస్తే… తొలి 103 మ్యాచ్ లలో కేవలం 2 సెంచరీలను నమోదు చేయగా, మలి 54 మ్యాచ్ లలో ఏకంగా 9 శతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సరిగ్గా సచిన్ కెరీర్ మాదిరే రోహిత్ కెరీర్ కూడా సాగుతుండడం విశేషం. అయితే ఎంత తేలికగా అద్భుతమైన షాట్లను కొడతాడో, అంత బద్ధకమైన షాట్లకు కూడా నిలయంగా రోహిత్ నిలవడమే అభిమానులకు రుచించని అంశం.