Robo-Teachers-by--2030సమాచార సాంకేతిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోంది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో అతిపెద్ద ఇంటర్నెట్ కంపెనీ ఏది? అన్నదానిపై డావిన్సీ ఇనిస్టిట్యూట్‌ లో భవిష్యత్తును అంచనా వేసే మేధావిగా పేరు తెచ్చుకున్న థామస్‌ ఫ్రే పలు ఆసక్తికర అంశాలు చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీగా “ఆన్‌ లైన్‌ ఎడ్యుకేషన్”ని నిర్వహించే పెద్ద కంపెనీయే నిలబడుతుందని పేర్కొన్నారు.

అయితే ఆన్ లైన్ లో ఈ వ్యాపారాన్ని మనుషులు సమర్థవంతంగా నిర్వర్తించలేరని, ఈ వ్యాపారంలో రోబోలు అద్భుతంగా రాణిస్తాయని చెప్పారు. ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో ఉన్న విద్యార్థులనుద్దేశించి పాఠం చెబుతారని, కానీ రోబో అయితే తరగతి గదిలోని ప్రతి విద్యార్థి మానసిక పరిస్థితిని అంచనా వేసి, ఆ విద్యార్థికి అర్ధమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తుందని ఆయన అన్నారు. అంతే కాకుండా స్క్రీన్ ముందు కూర్చున్న విద్యార్థి ప్రతిభతో పాటు అభిరుచులను కూడా అంచనా వేసి అతనికి తగ్గట్టుగా పాఠాలు బోధిస్తుందని అన్నారు.

అంతే కాకుండా వారాంతంలో హోం వర్క్‌ చేయడంలో ప్రతి విద్యార్థికి రోబో టీచర్లు చక్కగా సహకరిస్తారని, రోబో టీచర్ల రాక కారణంగా ప్రస్తుతం ఓ తరగతి సగటు విద్యార్థి ఏడాదిలో నేర్చుకుంటున్న విద్యను ఆరు నెలల్లోనే నేర్చుకునే అవకాశం ఉందని, ఈ మార్పులన్నీ రానున్న 14 ఏళ్లలోనే చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సులో శరవేగంగా వస్తున్న మార్పులు, అంటే గూగుల్‌ కంపెనీ అభివద్ధి చేస్తున్న డీప్‌ మైండ్, ఐబీఎం అభివద్ధి చేస్తున్న వాట్సన్‌ ఇంధన శక్తితో పనిచేసే రోబోలు, అమెజాన్‌ కంపెనీ అభివద్ధి చేస్తున్న డ్రోన్ సర్వీసు వ్యవస్థలను దృష్టిలో పెట్టుకొని థామస్‌ ఫ్రే ఈ అంచనాలను వేశారు.

2030 నాటికి తన అంచనాలు నిజమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని నాశనం చేస్తుందని పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కృత్రిమ మేధస్సు కారణంగా మానవాళికే ముప్పు పెరుగుతుందని, సైనిక అవసరాల్లో ఈ కృత్రిమ మేధస్సును వినియోగిస్తే దేశాలు అంతమైపోతాయని పలువురు గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.