Robo 2.0 Movie Sets Media Attak By Bouncersప్రస్తుతం దేశంలో ఏది “పవర్ ఫుల్” అంటే ఖచ్చితంగా దానికి సమాధానం “మీడియా” అని వస్తుంది. హీరోను జీరో చేయాలన్నా… జీరోను హీరో చేయాలన్నా… మీడియా చేతిలో ఉంటే ఏదైనా సాధ్యం అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జీవితాలలో మీడియా ప్రాముఖ్యత తారస్థాయికి చేరిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే… మీడియా సహకారం లేకుండా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జీవితాలు లేవు అని చెప్పడంలో సందేహం లేదు.

మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన మీడియాపై “రోబో 2.0” సెట్స్ పై దాడి చేస్తే ఊరుకుంటారా? తమిళనాడులోని ట్రిప్లికేన్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ చేసి షూటింగ్ జరుపుతున్న “రోబో 2.0”ను కవర్ చేసేందుకు, ఇద్దరు మీడియా ప్రతినిధులు వెళ్ళగా, ఇది చూసిన బౌన్సర్లు ‘ఎందుకు ఫోటోలు తీసారంటూ’ దాడి చేసారు. దీంతో విషయం పోలీసు స్టేషన్ దాకా వెళ్ళడంతో… ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు శంకర్ కలుగ జేసుకోక తప్పలేదు.

“తనకు తెలియకుండా జరిగిన విషయమని, అయినప్పటికీ మీడియా ప్రతినిధులను క్షమించమని కోరుతున్నానని, రెండు చేతులు జోడించి దర్శకుడు శంకర్ నమస్కారం పెట్టడంతో” శాంతించిన మీడియా ప్రతినిధులు సదరు ఫిర్యాదును వాపసు తీసుకున్నారు. ఎంతటి టాప్ దర్శకులైనా మీడియా ముందు ఎంతో అన్న విషయం ఈ సందర్భంగా రుజువైంది. రేపు సినిమా విడుదలైన రోజున మరి ఆ మీడియానే కదా… ‘సినిమా కేక… తోపు…’ అని చెప్పాల్సింది. ఈ పరిణామంతో మీడియా పవర్ ఏంటో మరోసారి చాటిచెప్పినట్లయ్యింది.