Nara Chandrababu-Naidu AP Former Chief Ministerఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి సున్నా…అప్పులు, కక్ష సాధింపులు, హత్యలు, అత్యాచారాలు మాత్రం నూటికి నూరు శాతం అన్నట్లుంది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో ఏపీ సీఐడీ పోలీసులు నారాయణ విద్యాసంస్థల అధినేత పి. నారాయణను ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి చిత్తూరుకి తరలిస్తున్న సమయంలోనే, ఆయనతో సహా టిడిపి అధినేత, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు తదితరులపై మరో కొత్త కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించడంపై టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి.

అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో అవకతవకలు జరిగినట్లు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అళ్ళ రామకృష్ణా రెడ్డి గత నెల 27న ఫిర్యాదు చేయడం, దానిపై పోలీసులు విచారణ జరిపి ఆదివారం కేసు నమోదు చేశారనే విషయం ఈరోజు హటాత్తుగా బయటపెట్టడం యాదృచ్ఛికం కాదనే అర్దమవుతోంది. ఆ కేసులో లోతుగా దర్యాప్తు జరిపి అవకతవకలు జరిగినట్లు నిర్ధారించుకొన్నాకనే కేసులు నమోదు చేశామని ఏపీ సీఐడీ అధికారులు తెలిపారు.

ఈ కేసులో టిడిపి అధినేత, ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్టు, రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్‌లపి కేసులు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.

ఈ కేసులో ఐపీసి సెక్షన్స్ 120బి, 420,34,35,36,37,166,167,217లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 13(2) రెడ్‌ విత్ 13 (1ఏ) కింద కేసులు నమోదు చేశారు.

చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి భూసేకరణకు ముందు టిడిపి ప్రభుత్వ పెద్దలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసుకొని భారీగా లబ్ది పొందారంటూ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గతంలో వేసిన కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అందుకు ఆయా బలమైన సాక్ష్యాధారాలు చూపలేకపోవడంతో కేసును కొట్టివేసింది. కనుక ఈసారి వేరే ఆరోపణలతో మళ్ళీ కేసు బనాయించి, జగన్ ప్రభుత్వం తమ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి నేతలు వాదిస్తున్నారు.

ఇటీవల చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు బయలుదేరి బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రజలకు చేరువవుతున్నట్లు గ్రహించి, సిఎం జగన్మోహన్ రెడ్డి ఈవిదంగా వారిపై అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిడిపి నేతలు వాదిస్తున్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు, ప్రతిపక్ష నేతలను రాజకీయంగా దెబ్బ తీసేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపిస్తున్నారు