ఏబీఎన్ కధనంపై వైసీపీ మౌనమేల? ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ సంచలన కధనాన్ని ప్రచురించింది. ఇడుపులపాయ వేదికగా వైఎస్సార్ ఫ్యామిలీలో విభేదాలు బయట పడ్డాయంటూ చెప్పిన కధనం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కధనం వివరాల ప్రకారం…

ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలకు వైఎస్సార్ కు నివాళులు అర్పించి ఇడుపులపాయలో ఉన్న అతిధి గృహంలో కుటుంబ సభ్యులు సేద తీరడం అలవాటు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా జగన్ – షర్మిల – విజయమ్మలు ఇడుపులపాయ విచ్చేసారు.

ఇక్కడ జగన్ – షర్మిల నడుమ ఆస్తి తగాదాలు వచ్చినట్లుగా, చెల్లి షర్మిలకు ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పినట్లుగా, అందుకు షర్మిల ఆగ్రహంతో అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా తెలిపారు. అలాగే జగన్ వైఖరితో విసిగిపోయిన విజయమ్మ కూడా ఆ రాత్రి సమయంలోనే సొంత గృహానికి వెళ్లిపోయారట.

మరుసటి రోజు వైఎస్సార్ కు నివాళులు అర్పించే కార్యక్రమంలో జగన్ మరియు విజయమ్మలు ఎవరికి వారు విడివిడిగా విచ్చేసారు. అన్న మీద ఆగ్రహంతో వెళ్లిపోయిన షర్మిల, ఎలా అయినా అన్నకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా ఏబీఎన్ కధనంలో అసలు హైలైట్.

తండ్రి వైఎస్సార్ ఉన్నపుడు ఆస్తిలో ఇద్దరికీ చెరి సగం వాటాలు ఉంటాయని వివిధ సందర్భాలలో చెప్పగా, దీనికి ఎలాంటి వ్రాతపూర్వకమైన ఆధారం లేకపోవడం, విజయమ్మ ఎంత చెప్పినా జగన్ వినకపోవడం వంటివి ప్రస్తుత విభేదాలకు కారణంగా పేర్కొన్నారు.

వైఎస్సార్ ఉన్నపుడు సతీమణిగా విజయమ్మకు దక్కిన గౌరవభావాలు నేడు జగన్ తల్లిగా లభించడం లేదని, అందులోనూ అన్నా-చెల్లెల్లు నడుమ తలెత్తిన ఆస్తి విభేదాలు ఓ తల్లిగా విజయమ్మకు తీవ్ర మనోసంక్షోభాన్ని మిగులుస్తున్నట్లుగా కూడా ఈ కధనంలో ప్రత్యేకంగా చెప్పారు.

జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులు విచారణ జరిగి ఒకవేళ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే, తదుపరి ముఖ్యమంత్రిగా భారతిరెడ్డికి బదులు విజయమ్మను తెరపైకి తీసుకువచ్చి జగన్ కు బ్రేకులు వేయాలనే ఆలోచనలు కూడా చేస్తున్నట్లుగా, రాజకీయంగా జగన్ ను కిందకి దించితే న్యాయం జరగదనే భావనలో షర్మిలకు సలహాలు వస్తున్నట్లుగా కూడా తెలిపారు.

ఏది ఏమైనా ఏపీలో సంచలనంగా మారిన ఈ కధనంపై వైసీపీ వర్గాలు మౌనం వహించడం మరింత విడ్డురంగా మారింది. ఒక చిన్న సలహా ఇస్తేనే వెతికి వెతికి కొట్టే నేతలు గానీ, అలాగే సాక్షి మీడియా గానీ ఈ కధనంపై ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం ఏబీఎన్ కధానానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లయింది.