Risky Films Done by Balayya at the beginning of his careerవిశ్వవిఖ్యాత నటసార్వభౌముడి వారసత్వాన్ని ఒక్కడే మోయాల్సిన బాధ్యత తీసుకోవడం ఏ హీరోకైనా అంత సులభం కాదు. అందులోనూ తెలుగు ప్రజలు నట ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ కు సంతానం ఎందరున్నా కళాతృష్ణని కొనసాగించే ఆసక్తి అధిక శాతం బాలకృష్ణలోనే ఉండటం ఎంత లేదన్నా బరువే అవుతుంది. ఎందుకంటే బాలయ్య ఇండస్ట్రీలో సోలో హీరోగా తొలి అడుగులు వేసే నాటికే కమర్షియల్ సినిమా రాజ్యమేలుతోంది. తండ్రి పౌరాణికాలు, ఇతిహాసాలకు స్వస్తి చెప్పి అడవి రాముడు లాంటి మాస్ ఎంటర్ టైనర్ తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన టైం అది. ఎన్టీఆర్ అబ్బాయిగా బాలకృష్ణ నుంచీ అలాంటివే ఫ్యాన్స్ ఆశించడం సహజం.

ఒక మూసకు కెరీర్ ప్రారంభంలోనే కట్టుబడితే అదెంత ప్రమాదమో బాలయ్యకు తెలియంది కాదు. అందుకే ఆ ఉచ్చులో పడకుండా తనలో నటుడికి పరీక్ష పెట్టే కథలను దర్శకులను ఎంచుకోవడం తొలినాళ్ళలోనే గమనించవచ్చు. ఉదాహరణకు 1984లో వచ్చిన జనని జన్మభూమిని తీసుకోవచ్చు. కళాతపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన మంచి ఎమోషనల్ మూవీ ఇది. కోట్ల ఆస్తులున్న తండ్రి బాటను వీడి తన మూలలను పల్లెటూళ్ళలో వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు ఇల్లొదిలి వెళ్ళిపోయిన యువకుడి కథ ఇది. చదువుతుంటే మహేష్ బాబు శ్రీమంతుడు గుర్తొస్తోంది కదూ. కొరటాల శివ తీసుకున్న మెయిన్ పాయింట్ ఇక్కడిదేనని బాహాటంగా చెప్పొచ్చు.

ఇది బాక్సాఫీస్ లెక్కల్లో గొప్ప విజయం సాధించలేదు కానీ బాలకృష్ణకు సవాళ్లను స్వీకరించే ధోరణి మాత్రం అప్పటి నుంచే అలవడింది. నిజానికప్పుడు తను ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా శంకరాభరణం లాంటి దృశ్యకావ్యాన్ని తీసిన దర్శకుడితో పనిచేస్తే తనను తాను సానబెట్టుకోవచ్ఛన్న ఆలోచన రిస్క్ కి సిద్ధపడేలా చేసింది. మంగమ్మ గారి మనవడుతో విపరీతమైన మాస్ ఇమేజ్ వచ్చినా సరే జంధ్యాలతో బాబాయ్ అబ్బాయ్ లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయడం బాలయ్య వివిధ పార్శ్యాలను ఆవిష్కరించే ప్రయత్నమే. దీని ఫలితం తేడా వచ్చినా మళ్ళీ ఆయనతోనే సీతారామ కళ్యాణం చేసి హిట్టు కొట్టడం ఒకరకంగా సంచలనమే.

గిరిగీసుకుని ఫార్ములాకు కట్టుబడి ఉంటే కేవలం చెల్లెలి సెంటిమెంట్ తో నడిచే తమిళ రీమేక్ ముద్దుల మావయ్యతో ఇండస్ట్రీ హిట్ దక్కేది కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఫైట్లు ఐటెం సాంగులు లేని నారి నారి నడుమ మురారిని కోదండరామిరెడ్డి లాంటి మాస్ డైరెక్టర్ తో సక్సెస్ దక్కించుకోవడం చిన్న విషయమా. ఇక భైరవ ద్వీపం, ఆదిత్య 369 గురించి చెప్పాలంటే పేజీలు చాలవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కానీ ఇక్కడ ఇప్పటి హీరోలు నేర్చుకోవాల్సింది ఒకటుంది. ప్రేక్షకులను తమను ఫలానా కథల్లోనే చూస్తారనే భ్రమలో నుంచి బయటికి వస్తేనే నటుడిగా స్టార్ గా ఎదిగే బాటలు పడతాయి.