Rising Pune Supergiantరైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనిని తొలగించిన నాటి నుండి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. అందులోనూ ఐపీఎల్ ప్రారంభంలో స్థాయికి తగ్గ చూపడంలో ధోని విఫలం కావడంతో, వీటి జోరు మరింత ఊపందుకుంది. అయితే ప్రస్తుతం పూణే ఐపీఎల్ ఫైనల్లో నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం కెప్టెన్ స్మిత్ కంటే మహేంద్ర సింగ్ ధోనియే అన్నది క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే.

అయినప్పటికీ టీం యాజమాన్యం మాత్రం ధోనికి తగిన గుర్తింపు ఇవ్వడం సంగతి పక్కన పెడితే, కెప్టెన్ స్మిత్ ను పొగుడుతూ మరో రకంగా ధోనిని కించపరిచే కార్యక్రమాలు చేస్తుండడం విస్తుపోయే విషయం. తొలుత పూణే జట్టు యాజమాని హర్ష్ గోయెంకా ధోనిని అవమాన పరిచే కార్యక్రమం చేయగా, తాజాగా ఆ బాధ్యతలను హర్ష్ సోదరుడు సంజీవ్ గోయెంకా తీసుకున్నట్లుగా కనపడుతోంది. తాజాగా ఇచ్చిన ఓ మీడియా ఇంటర్వ్యూలో…

ధోని గొప్ప ఆటగాడే, ప్రపంచంలోని బెస్ట్ కీపర్ బ్యాట్స్ మెన్… అంటూ కితాబిస్తూనే, ధోని కన్నా స్మిత్ అద్భుతమైన మైండ్ సెట్ గలవాడని, విజయం తప్ప మరొకటి అంగీకరించడని, ఐపీఎల్ ప్రారంభంలో స్మిత్ కు ఫుడ్ పాయిజన్ కావడం వలనే సరిగా పూణే రాణించలేకపోయిందని అన్నారు. అంటే స్మిత్ వలనే పూణే ఫైనల్స్ కు చేరిందని, ఇందులో ధోని పాత్రేమీ లేదనే విధంగా పరోక్షంగా కౌంటర్లు వేసాడు సంజీవ్.

దీంతో మరోసారి మహేంద్ర సింగ్ ధోని అభిమానులు భగ్గుమంటున్నారు. ధోని ఉన్నప్పటికీ, ఫైనల్లో పూణే ఓటమి పాలయితే గానీ స్మిత్ కెప్టెన్సీ స్థాయి ఏమిటో పూణే ఓనర్లకు తెలిసి వస్తుందని, ఫైనల్లో ధోని ఆడాలి… పూణే ఓడాలి… అనే నినాదాన్ని ఇస్తున్నారు. ధోని విలువ ఏమిటో పూణే సభ్యుడు బెన్ స్టోక్స్ ఇటీవల పూసగుచ్చినట్లుగా వివరించగా, క్రీడా పండితులు కూడా ‘ఇన్ విజిబుల్ కెప్టెన్’గా కీర్తిస్తున్న సమయంలోనే సంజీవ్ గోయెంకా ఇలా ధోని స్థాయిని తక్కువ చేసే విధంగా మాట్లాడడం విశేషం.