టీమిండియాకు ఒక వికెట్ కీపర్ గా ఎంపికైన మహేంద్ర సింగ్ ధోని, తదనంతరం టీమిండియా కెప్టెన్ గా అవతరించడానికి గల కారణం… అతనిలో ఉన్న బ్యాటింగ్ ప్రతిభ. అప్పటివరకు టీమిండియాకు కీపర్ గా ఉన్న వారంతా టైల్ ఎండర్స్ మాదిరి అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడమే పరిపాటిగా మారిన తరుణంలో… ఊతకొట్టుడు అంటే ఎలా ఉంటుందో అనే విషయాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడంతో మహేంద్ర సింగ్ ధోని అనే పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ధోని కాలం ముగిసింది. మునుపటి మాదిరి బౌలర్లపై విరుచుకుపడే స్థాయిలో ధోని బ్యాటింగ్ ప్రతిభ లేకుండాపోయింది. వికెట్ కీపర్ గా ప్రత్యామ్నాయంగా సాహా, పార్థీవ్ పటేల్ వంటి వారు విధులు నిర్వహిస్తున్నారు గానీ, బ్యాటింగ్ కు వచ్చేపాటికి ధోని స్థాయి వారిది కాదు. దీంతో ధోనిని సరిపోలిన వారు ఎవరన్న విషయంపై సెలక్టర్లు ఓ కన్నేశారు. దీనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేదిక అయ్యింది. ఎనిమిది జట్లల్లో నుండి కీపర్ బ్యాట్స్ మెన్ గా ఎవరు ప్రతిభ కనపరుస్తారో, భవిష్యత్తు వారిదే అన్న సంకేతాలు కూడా స్పష్టమైంది.

ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ముగియగా, ఇందులో ధోనితో సహా ఎవరూ ఆశించిన ప్రతిభ కనపరచలేకపోయారు, ఒక్క రిషబ్ పంత్ తప్ప! ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున బరిలోకి దిగిన పంత్, ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించినంత పని చేసాడు. అయితే సహచర బ్యాట్స్ మెన్ల సహకారం లోపించడంతో, ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయినా, పంత్ పోరాటపటిమ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే… ఏ మాత్రం బెరుకు, వణుకు లేకుండా క్రీజులోకి వచ్చిన మొదటి బంతినే సిక్సర్ గా మలిచి, పంత్ ఆడిన తీరు, తొలినాళ్ళల్లోని ధోని ఆటతీరును గుర్తుకు తెచ్చింది.

టీమిండియా తరపున ఆడడానికి ఎలాంటి వికెట్ కీపర్ కోసమైతే సెలక్టర్లు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారో, సరిగ్గా అదే తరహాలో పంత్ తన ప్రతిభ కనపరిచాడు. రాబోతున్న మ్యాచ్ లలో కూడా ఇదే రకమైన ఆటతీరును ప్రదర్శిస్తే… తదుపరి టీమిండియా సిరీస్ లో కీపర్ స్థానం పంత్ దే అని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి పంత్ పేరు వినపడం ఇదే మొదటిసారి కాదు. గత అయిదారు నెలలుగా జాతీయ స్థాయిలో పంత్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడని మీడియా వర్గాలు, క్రికెట్ విశ్లేషకులు పంత్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇటీవల టీమిండియా ఆడిన సిరీస్ లకు పంత్ ను ఎంపిక చేస్తారని అంతా భావించినప్పటికీ, అది సాధ్యం కాలేదు. కానీ ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తే సెలక్టర్లకు పీక మీద కత్తి పెట్టినట్లే భావించవచ్చు. జాతీయ మ్యాచ్ లకు ప్రేక్షకుల ఆదరణ ఉండదు గనుక, ఎంత కొట్టినా పెద్దగా వెలుగులోకి రాదు. కానీ, ఐపీఎల్ లో ఒక్క 50 పరుగులు చేసిన ఎనలేని గుర్తింపు సొంతమవుతుంది. ధోని స్థాయిలో వికెట్ కీపర్ ను వెతకడం కష్టమేమో గానీ, బ్యాటింగ్ లో మాత్రం పంత్ ప్రామిసింగ్ క్రీడాకారుడిగా కనపడుతున్నాడు.