rishabh pant ipl 2017 Delhi Dare Devilsబీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పండగ చాలామంది క్రికెటర్లకు పునర్జీవితాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటికే ఆయా జట్ల నుండి తొలగించబడిన క్రికెటర్లు, ఐపీఎల్ పుణ్యమా అంటూ మళ్ళీ అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇంటర్నేషనల్ ప్లేయర్ల పరిస్థితి ఇలా ఉంటే, భారత యువకిశోరాలు కూడా ఎంతోమంది ఐపీఎల్ వల తమ జీవితాలను మార్చుకున్నారు. ప్రస్తుతం ఆ జాబితాలోనే రిషబ్ పంత్ కూడా పయనిస్తున్నట్లుగా కనపడుతున్నాడు.

ఈ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రిషబ్ పంత్ పేరు గత ఏడాది కాలంగా దేశీయంగా మారుమ్రోగుతోంది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా ధోనిని పంత్ రీప్లేస్ చేయగలడని క్రీడా విశ్లేషకులు కితాబిస్తున్న తరుణంలో… వారికి మరింత నమ్మకాన్ని ఇచ్చే విధంగా ఈ ఐపీఎల్ లో పంత్ రాణిస్తున్నాడు. తాజాగా గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా పంత్ ఆడిన ఇన్నింగ్స్ తో క్రికెట్ అభిమానులే కాదు, దిగ్గజాలు కూడా ముగ్ధులయ్యారు.

చావోరేవో అంటూ బరిలోకి దిగిన ఢిల్లీకి రైనా సారధ్యంలోని గుజరాత్ లయన్స్ జట్టు 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. రైనా 77, దినేష్ కార్తీక్ 65 పరుగులతో వాయువేగంగా ఆడడంతో గుజరాత్ స్కోర్ బోర్డు ఉరకలెత్తింది. ఇక భారీ లక్ష్య చేధనలో ఆదిలోనే కెప్టెన్ కరుణ్ నాయర్ వికెట్ ను కోల్పోయిన తరుణంలో మరో ఓపెనర్ సంజూ శాంసన్ కు రిషబ్ పంత్ తోడయ్యాడు. దీంతో ఏదో ఉప్పెన వచ్చి ఊరి మీద పడ్డట్టు… వీరిద్దరి భాగస్వామ్యం గుజరాత్ జట్టు ఆశలపై సునామీ నీళ్ళు జల్లింది.

ముఖ్యంగా రిషబ్ పంత్ కొడుతున్న షాట్లకు నివ్వెరపోవడం రైనా వంతయ్యింది. ఎలాంటి బంతి వేసినా తన హ్యాండ్ పవర్ తో దానిని సిక్సర్ గా మలిచి, గుజరాత్ బౌలర్లకు ఫిరోజా కోట్ల మైదానంలో ‘స్టార్స్’ను లెక్కపెట్టేలా చేసాడు. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరూ కలిసి ఆడిన 10.1 ఓవర్లు టెలివిజన్లలో ప్రదర్శించే హైలైట్స్ మాదిరి సాగాయి. ఈ ఓవర్లలో ఏకంగా 143 పరుగులను నమోదు చేసారంటే, పంత్–శాంసన్ ల విధ్వంసం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. తొలుత శాంసన్ 31 బంతుల్లో ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా 7 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆ కొద్దిసేపటికే సెంచరీ ఖాయం అనుకున్న పంత్ 43 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. పంత్ ఔటైన తర్వాత రైనా వచ్చి బుగ్గలు నిమిరారంటే… ఏ రేంజ్ లో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరూ ఔటైనప్పటికీ, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో కేవలం 17.3 ఓవర్లలో 214 పరుగులు నమోదు చేసి సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే… ఇప్పటివరకు ధోని మాదిరి బ్యాటింగ్ చేయగల కీపర్ లేడంటూ మదనపడిన సెలక్టర్లకు తానే అసలు ప్రత్యామ్నాయం అంటూ పంత్ చాటిచెప్పినట్లయ్యింది. ధోని వచ్చిన తొలినాళ్ళల్లో ఏ విధంగా అయితే బౌలర్లపై విరుచుకుపడేవాడో, పంత్ సరిగ్గా అలానే ఆడుతున్నాడు. దీంతో టీమిండియాకు కీపర్ బ్యాట్స్ మెన్ కొరతను రిషబ్ పంత్ పూరించగలడని క్రికెట్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు సాహా, పార్థీవ్ పటేల్ లు కూడా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ధోని స్థాయిలో మాత్రం కాదనే చెప్పాలి. పంత్ మాత్రం మరో ధోని అనే నమ్మకాన్ని కలిగించడంలో సక్సెస్ సాధించాడు.