rishabh pant breaks dhoni recordటీమిండియా రధసారధిగానే కాకుండా బ్యాట్స్ మెన్ గా కూడా మహేంద్ర సింగ్ ధోని అనేక రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. కానీ ఆ మహెంద్రుడికి కూడా సాధ్యం కాని ఓ రికార్డును తాజా సంచలనం రిషబ్ పంత్ తన రెండవ టెస్ట్ మ్యాచ్ లోనే సాధించాడు. అవును… ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ అద్వితీయమైన పోరాటపటిమను ప్రదర్శించి, అమోఘమైన సెంచరీని నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ, పంత్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది, విమర్శకులను మెప్పించింది. అయితే ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును కూడా తన వశం చేసుకున్నాడు రిషబ్. నాలుగవ ఇన్నింగ్స్ లో ఓ ఇండియన్ వికెట్ కీపర్ గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను పంత్ సొంతం చేసుకున్నాడు. అంతకుముందు వరకు మహేంద్ర సింగ్ ధోని సాధించిన 76 పరుగులే అత్యధికం.

నాలుగవ ఇన్నింగ్స్ లో కనీసం సెంచరీ దరిదాపుల్లోకి కూడా రాలేని ఇండియన్ వికెట్ కీపర్ జాబితాను రిషబ్ తన బ్యాటింగ్ ప్రతిభతో సవరించాడు. విశేషం ఏమిటంటే… అంతకుముందు ధోని పేరిట ఉన్న 76 పరుగులు కూడా ఇంగ్లాండ్ లోనే నమోదు కావడం. ఓటమి పాలు కావాల్సిన ఆ మ్యాచ్ లో ధోని అజేయమైన ఇన్నింగ్స్ మ్యాచ్ ను డ్రాగా ముగించడంలో తోడ్పడింది.