Rio 2016 Olympics, Rio 2016 Olympics Maracanã Stadium, Rio 2016 Olympics Athletes, Rio 2016 Olympics Games, Rio 2016 Olympics Swimmers, Rio 2016 Olympics  Rio de Janeiro Brazilవిశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతి పెద్ద క్రీడా సంరంభం ఒలంపిక్స్ కు రంగం సిద్ధమైంది. రియో డి జెనిరో వేదికగా మరకానా స్టేడియంలో అత్యంత వైభవంగా జరగనున్న వేడుకలతో మహా క్రీడా కుంభమేళాకు తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు మరకానా స్టేడియంలో ఆరంభోత్సవం జరగనుంది. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. ఆరంభ వేడుకల్లో ఆరు వేల మందితో సాగే నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

రియో ఒలింపిక్స్ నిర్వహణకు మొత్తంగా 77.237 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు సాగే ఈ విశ్వ క్రీడా సంరంభంలో 206 దేశాలకు చెందిన 10,500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 28 క్రీడల్లో 306 పతకాల ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. పురుషులకు 161 విభాగాల్లో పోటీలు ఉండగా మహిళలకు 136 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇద్దరికీ కలిపి 8 ఈవెంట్లు జరుగుతాయి. క్రీడలు తిలకించే వారికోసం 75 లక్షల టికెట్లు విక్రయించారు. వీటిని తిలకించేందుకు 5 లక్షల మంది పర్యాటకులు రియో వస్తారని అంచనా వేస్తున్నారు.

ఒలింపిక్స్ క్రీడల టీవీ ప్రసార హక్కుల కోసం ఎన్బీసీ యూనివర్సల్ దాదాపు 8 వేల కోట్లు చెల్లించింది. దక్షిణ అమెరికా ఖండంలో జరుగుతున్న తొలి ఒలింపిక్ క్రీడలు ఇవే కావడం గమనార్హం. ఇక, భారత్ విషయానికి వచ్చే పాటికి, వంద మందికి పైగా క్రీడాకారులతో రంగంలోకి దిగుతోంది. 2012 లండన్ ఒలంపిక్స్ లో 81 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్ ఆరు పతకాలు సాధించింది. ఈ సారి 118 మంది క్రీడాకారులతో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఒలంపిక్స్ లో వంద మందికి పైగా భారత క్రీడాకారులు పాల్గొనడం ఇదే తొలిసారి.