Ram-Gopal-Varmaసంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సిద్ధాంతం ఇది. అవును… ఏ పని చేసినా అందులో ‘బ్యాక్ గ్రౌండ్ & ఫోర్ గ్రౌండ్’ మిళితం అయ్యేలా చూసుకోవడంలో వర్మ దిట్ట. తన సినిమాల రిలీజ్ ల సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ఓ పక్కన సినిమాకు, మరో పక్కన తనకు పబ్లిసిటీ అయ్యేలా చేసే వర్మ, తాజాగా శ్రీరెడ్డి విషయంలో కూడా అదే చేసారు.

పవన్ కళ్యాణ్ ను అలా తిట్టమని నేనే చెప్పానంటూ రిలీజ్ చేసిన వర్మ వీడియోపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్మ స్క్రిప్ట్ లకు అంతులేకుండా పోతోందని, ఈ దృష్టి ఏదో సినిమాలపై పెడితే అవన్నా బాగుంటాయని వస్తోన్న విమర్శలు కోకొల్లలు. అయితే ఈ వీడియో వలన కూడా వర్మ ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్న సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు.

పవన్ పై చేసిన విమర్శల రీత్యా శ్రీరెడ్డి ఉద్యమం పక్కదారి పట్టినా, ఆమె మరింతగా పాపులర్ అయిన విషయం అందరూ ఒప్పుకునేదే. అలాగే ఈ వీడియో రిలీజ్ తర్వాత శ్రీరెడ్డితో పాటు ప్రస్తుతం వర్మ కూడా మీడియా వర్గాలకు హాట్ టాపిక్ గా మారారు. హైపర్ ఆది చెప్పినట్లు ‘ఇండియాలో స్వాతంత్ర్యం ఒక్క వర్మకే వచ్చిందేమోనని’ ఈ సందర్భంగా గుర్తు రాక మానదు.