RGV - Ram Gopal Varma - Kamma Rajyam Lo Kadapa Reddluరామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈ నెల 29న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా తనను అవమానకరంగా చూపిస్తున్నారని ప్రముఖ మతప్రబోధకుడు కెఏ పాల్ హైకోర్టుని ఆశ్రయించారు. సినిమా విడుదలను ఆపివెయ్యాలని ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు.

దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో నేను ఎవరినీ టార్గెట్ చెయ్యలేదు. చంద్రబాబు నాయుడుని నేను జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదు. జగన్ ప్రమాణస్వీకారానికి నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు విజయవాడ అంతా రెడ్లతో నిండిపోవడం చూసి నాకు ఈ ఐడియా తట్టింది,” అని రాము చెప్పుకొచ్చారు.

“ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడానికి చేసే ఒక ప్రయత్నం నా కథ. ఇది కల్పితంగానే చూడాలి,” అని రాము తెలివి తేటలుగా చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని పెట్టి, ప్రస్తుత ముఖ్యమంత్రిగా జగన్ ని పోలిన వ్యక్తులని పెట్టి నేను ఎవరినీ టార్గెట్ చెయ్యడం లేదు అంటే ఎలా?

పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి మీద మాజీ ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడంటే అధికార పార్టీ క్యాడర్ కు ఏమని మెస్సేజ్ పంపుతున్నట్టు? ఇది శాంతిభద్రతల విషయం కాదా? ఇప్పుడు ఈ సినిమా పై కోర్టు గానీ సెన్సార్ బోర్డు గానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.